మరికొందరు పోలీసుల అదుపులో..
ఎన్నికలు సజావుగా సాగేందుకేనని ముంబై పోలీసుల వెల్లడి
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్‌సీఎఫ్ నగర్, తిలక్‌నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్‌నార్, మాన్‌ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్‌పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్‌సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్‌కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.
రూ. 14.5 కోట్ల బంగారం సీజ్
నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్‌లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment