రాత్రి అరెస్టు.. ఉదయాన్నే ఎన్కౌంటర్!
సాక్షి, చైన్నె: చైన్నె కమిషనరేట్ పరిధిలో రెండున్నర నెలలవ్యవధిలో మూడో ఎన్కౌంటర్ సోమవారం జరిగింది. ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అరెస్టయిన చైన్నె తాంబరంకు చెందిన ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజా సోమవారం ఉదయాన్నే జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వివరాలు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో రౌడీల గుండెలకు పోలీసులు ముచ్చెమటలు పటిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిని జల్లెడ పట్టి మరీ అరెస్టు చేస్తున్నారు. అదే సమయంలో చైన్నె పోలీసు కమిషనర్‌గా అరుణ్ బాధ్యతలు స్వీకరించగానే ఈ కేసులో నిందితుడైన తిరువెంగడంను ఎన్కౌంటర్లో హతమార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో రౌడీ కాకా తోపు బాలాజీని మట్టుబెట్టారు. ఆర్మ్ స్ట్రాంగ్ కేసులో నిందితుల వేట ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో 29వ నిందితుడిగా ఏ వన్ రౌడీ సీ సింగ్ రాజాను ఆదివారం రాత్రి ప్రత్యేక బృందం పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఓ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతడిని చైన్నెకు తీసుకొచ్చి పారిశ్రామిక వేత్తకు బెదిరింపు ఇచ్చిన కేసు విచారణ నిమిత్తం వేళచ్చేరి స్టేషన్ పోలీసుకు అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయుధాలను దాచిపెట్టిన అక్కరై ప్రాంతానికి వేళచ్చేరి స్టేషన్ ఇన్స్పెక్టర్ విమల్ తన సిబ్బందితో సీ సింగ్ రాజాను తీసుకెళ్లారు. సీసింగ్ రాజాకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలిసిందే. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు తాము కూడా ఆయన భార్యలంటూ తెరమీదకు వచ్చారు. వీరిలో ఎవరికి మృతదేహం అప్పగించాలో అనే అయోమయంలో పోలీసులు పడిపోయారు.ఎదురుకాల్పుల్లో..ఆయుధాలను చూపిస్తానని పేర్కొని బకింగ్ హాం కాలువ తీరంలోని ఓ ప్రాంతానికి సీసింగ్ రాజ వెళ్లా డు. ఆయుధాలను చూపిస్తున్నట్టుగా పేర్కొంటూనే అక్కడున్న ఓ నాటు తుపాకీ ద్వారా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ విమల్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పొట్ట, ఛాతి భాగంలో తూటాలు దిగడంతో ఘటనా స్థలంలో సీ సింగ్ రాజా కుప్పకూలాడు. ఎన్కౌంటర్ సమాచారంతో గ్రేటర్ చైన్నె దక్షిణ జోన్ అదనపు కమిషనర్ శిబిరాజ్ నేతృత్వంలోని అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే సీ సింగ్ రాజాను ఆర్మ్‌స్ట్రాంగ్ కేసులో తాము విచారించలేదని, పారిశ్రామిక వేత్తకు బెదిరింపులు ఇచ్చిన కేసులో ఆయుధాల కోసం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని శిబిరాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు బయలుదేరాయి. రౌడీల ఎన్కౌంటర్ పర్వం కొనసాగుతుండటంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ సైతం అనుమానం వ్యక్తం చేశారు.వాహనాల సీజ్ నుంచి ఏ వన్ రౌడీగా..తాంబరం రామకృష్ణపురం సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన రాజ అలియాస్ సీసింగ్ రాజా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. తొలుత ఫైనాన్సియర్ ఒకరి వద్ద పనిచేశారు. ఎవరైనా కంతులు చెల్లించని పక్షంలో వారి వాహనాలను బలవంతంగా సీజ్ చేసి తీసుకెళ్లి ఫైనాన్సియర్‌కు అప్పగించే వాడు. మరమలై నగర్, ఇరుంగాట్టు కోట్టైలో రెండు పరిశ్రమల ఏర్పాటుతో తన దృష్టికి వాటి మీద పెట్టాడు. ఇక్కడి నుంచి వెలువడే ముడి ఇనుము, ఇతర పరికరాలను కొనుగో లు చేసి విక్రయించే క్రమంలో రౌడీ అవతారం ఎత్తాడు. అనుచరులను ఏకం చేసి, కిరాయి ముఠా నాయకుడిగా మారాడు. చైన్నెలో ప్రముఖ రౌడీలుగా ఉన్న ఆర్కాడు సురేష్ (ఇతడి హత్యకు ప్రతీకారంగానే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగింది)కు అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ కేసులో అజ్ఞాతంలో ఉన్న రౌడీ శంభో శంకర్‌కు మి త్రుడయ్యాడు. దీంతో ఏ వన్ రౌడీగా రాజ్య మేలు తూ వచ్చిన సీ సింగ్ రాజపై ఆరు హత్య కేసులతో పాటు 39 కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో నాన్ బె యిల్ వారెంట్లు కూడా ఉన్నాయి. ఇతడికి జానకీ, జాన్సీ అనే ఇద్దరు భార్యలు, ధనప్రియ, ధనుష్, యోగేష్ అనే కుమార్తె, కుమారులు ఉన్నారు. జాన్సీ ఆంధ్రాకు చెందిన మహిళ కావడంతో ఆర్మ్ స్ట్రాంగ్ హత్య అనంతరం కడపకు వెళ్లి తలదాచుకున్నాడు. చివరకు పోలీసులు అరెస్టు చేసి ఎన్కౌంటర్లో మట్టు బెట్టారు.మరో ఐదుగురు రౌడీల అరెస్టురౌడీల వేటలో భాగంగా చైన్నెలో సోమవారం నలుగురు, తిరుచ్చిలో ఓ ప్రముఖ రౌడీని అరెస్టు చేశారు. ఒట్టేరి, పులియాంతోపునకు చెందిన సుందర మూర్తి, కమల్, వెట్రి, భరత్ అనే ఈ నలుగురి రౌడీలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరి మీద అనేక పాత కేసులు ఉన్నాయి. అలాగే తిరుచ్చిలో వృద్ధులను టార్గెట్‌చేసి, కంతు వడ్డి చెల్లించని వారిని గురి పెట్టి, ఆస్తుల పత్రాలు, ఆస్తులను కబ్జా చేస్తూ వచ్చిన రౌడీ, ఓ పార్టీకి చెందిన పట్టరై సురేష్‌ను అరెస్టుచేశారు. అతడి ఇంట్లో ఉన్న 60 మంది బాధితులకు సంబంధించిన దస్తావేజులు పోలీసులు సీజ్ చేశారు. అలాగే తిరుచ్చిలో పరారీలో ఉన్న రౌడీ జంబుకేశ్వరన్ను పోలీసులు పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. సాయంత్రం జరిగిన ఈ కాల్పులలో రౌడీ కాలికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు.