చెన్నై : అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా తీరా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్య అనే వ్యక్తి ఆరు హత్య కేసులతోపాటు మొత్తం 35కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల అతడు బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నాడు. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరాలని ప్రయత్నించాడు. (నాకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో చెప్పాలి!)
అయితే నిందితుడు బీజేపీ కార్యక్రమంలో పాల్గొంటున్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల కదలికలను గమనించిన సూర్య కారులో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. సూర్య సహచరులలో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి ఆ తరువాత బెయిల్‌పై వారిని విడుదల చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41 ప్రకారం సూర్యపై కేసు నమోదైంది. ఆయనను వారంట్ లేకుండా అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ మాట్లాడుతూ.. పార్టీలో చేరాలని భావించిన వారి నేపథ్యం గురించి తనకు తెలియదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment