ఒక్క రోజులో 4 లక్షల కిలోల చికెన్ హాంఫట్!
తోడుగా రూ.7 కోట్ల లిక్కర్ కనుమ విందుకు సిద్ధం
శనివారం సెంటిమెంట్ దెబ్బకొట్టినా..
కలిసొచ్చిన ఆదివారం డిమాండ్
కనుమ శనివారం పడిందా.. అరె! మందు ముక్కా లేకుండా ఏం పండుగ!! అయినా పర్లేదు.. మరుసటి రోజు ఆదివారం కదా.. రెండు
రోజులది కలిపి లాగించేద్దాం..!!! ఇది మందుబాబులు, మాంసాహార ప్రియుల మాట.
విశాఖపట్నం: సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ.. మొదటి రెండురోజులు శాకాహారంతో సరిపెట్టినా.. మూడురోజైన కనుమ పండుగ నాడు మందు, ముక్క పడనిదే.. సంక్రాంతి పండుగ పరిపూర్ణం కాదు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈసారి కనుమ శనివారం నాడు వచ్చింది. శనివారం సెంటిమెంట్‌తో మెజారిటీ ప్రజలు మాంసాహారం ముట్టరు. దీంతో ఆదివారమే అసలైన కనుమ పండుగ జరుపుకోనున్నారు. కనుమ పండగనాడు మాంసాహారం.. అందులోనూ చికెన్‌కు అధిక ప్రాధాన్యమిస్తారు. త ర్వాత స్థానం మటన్‌ది. మామూలు రోజులకంటే కనుమ రోజు చికెన్ వినియోగం రెట్టింపునకుపైగా పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కనుమ శనివారం రావడంతో ఆదివారం ఆ లోటు తీర్చుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం చికెన్ ధర కూడా గతం కంటే అందుబాటులోనే ఉంది. స్కిన్‌తో కిలో రూ.150, స్కిన్‌లెస్ రూ.160 పలుకుతోంది. గత నెలలో అయితే రూ.200 దాటిన ధర ఇప్పుడు దిగిరావడంతో వినియోగం మరికొంత పెరిగే అవకాశం ఉంది. మామూలు ఆదివారాల్లో విశాఖ నగరం, జిల్లాలో 80 వేల నుంచి 1.20 లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుంది. కనుమ నేపథ్యంలో అది నాలుగు లక్షల కిలోకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం నాటి అమ్మకాలకు జిల్లాలోని కోళ్ల ఫారాలవారు దాదాపు రెండు లక్షల కోళ్లను సిద్ధం చేశారు. ఒక్కో కోడి సగటున రెండు కిలోల బరువుంటుంది. ఆ విధంగా మొత్తం నాలుగు లక్షల కిలోల చికెన్ అందుబాటులో ఉంచుతున్నారు. శనివారం సెంటిమెంట్‌తో నగరంలో కేవలం 25 వేల కిలోల చికెన్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.
మందుబాబుల మజా..
మరోవైపు మందుబాబులు లిక్కర్‌తో పాటు మాంసానికి ప్రాధాన్యమిస్తారు. కనుమ పండగను శనివారం కొద్దిమంది మందుప్రియులే సాదాసీదాగా జరుపుకున్నారు. ఆదివారం ముక్కనుమను మందు, ముక్కతో కలిసి మజా చేయనున్నారు. ఫలితంగా లిక్కర్ విక్రయాలు బాగా పెరగనున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు నగరంలోనే రూ.1.50 కోట్లు, జిల్లాలో మరో రూ.2 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఆదివారం దానికి రెట్టింపు వినియోగం ఉంటుందని అధికారులు, మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ముందుగా కావలసినంత మందును సిద్ధం చేశారు.