విశాఖలో మరో భూసంతర్పణ | 40 acres land given very cheap rate for two IT companies | Sakshi
Sakshi News home page

విశాఖలో మరో భూసంతర్పణ

Published Thu, Mar 15 2018 5:12 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

40 acres land given very cheap rate for two IT companies - Sakshi

భూమి చదును, మౌలిక సదుపాయాల బాధ్యత ప్రభుత్వానిదే.. నిబంధనలకు అతీతంగా కోరిన రాయితీలన్నీ మంజూరు 
30 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు.. ఐటీ స్పేస్‌ ఖాళీగా ఉంటే ప్రభుత్వమే అద్దె చెల్లించాలట!

సాక్షి, అమరావతి:  వంద రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఏదైనా సంస్థ ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మరో వంద రూపాయలు రాయితీ ఇస్తుందా? అంటే ఎవరైనా సాధ్యం కాదనే చెబుతారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ మంత్రిత్వ శాఖ ఐటీలో సాధ్యమై పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐటీ) విధానానికి విరుద్ధంగా ఈ రాయితీలు ఇవ్వడం గమనార్హం. అత్యంత విలువైన భూమిని ఐటీ కంపెనీలకు కారుచౌకగా ఇచ్చేయడమే కాకుండా, ఆ భూమిని చదును చేసి, రహదారులు, డ్రైనేజీ, నీటి వసతిని కల్పించేందుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర సర్కారు ఖజానా నుంచే భరించేందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకారం తెలిపారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఆ కంపెనీల పెట్టుబడి రూ.455 కోట్లే
విశాఖ జిల్లా మధురవాడ, రుషికొండలో సర్వే నంబర్‌ 409లోని 40 ఎకరాల భూమిని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవా సొల్యూషన్స్‌ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రుషికొండలో మార్కెట్‌ ధర ఎకరం రూ.10.16 కోట్లు ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే 40 ఎకరాల విలువ రూ.406.40 కోట్ల పైమాటే. అంత విలువైన భూమిని రెండు ఐటీ కంపెనీలకు తక్కువ ధరకే రాసిచ్చేశారు. ఎకరం రూ.32.50 లక్షల చొప్పున ఇవ్వాలని ఆ కంపెనీలు కోరగా, అందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అంగీకారం తెలిపింది. అంటే రూ.406.40 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని కేవలం రూ.13 కోట్లకే రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆ భూమిని చదును చేసి, రహదారి, డ్రైనేజీ సౌకర్యం, నీటి వసతి కల్పించడానికి మరో రూ.100 కోట్లు వ్యయం కానుంది. ఇంత చేస్తే ఆ రెండు కంపెనీలు పెట్టుబడి పెట్టేది కేవలం రూ.455 కోట్లేనట! 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందట! 

రాయితీలే రాయితీలు 
ప్రైవేట్‌ కంపెనీలు కోరినట్లే తక్కువ ధరకు భూమి కేటాయించడంతోపాటు రాయితీలు కూడా ప్రకటించారు. 40 ఎకరాల్లో  30 శాతం స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవచ్చు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించుకోవచ్చు. ఇక్కడ నిర్మించే ఐటీ సంస్థల్లో స్థలం ఖాళీగా ఉంటే 10,000 చదరపు అడుగులకు నెలకు రూ.3.90 లక్షల చొప్పున రెండేళ్ల పాటు ప్రభుత్వమే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల తరువాత కూడా అదే పరిస్థితి ఉంటే అద్దె చెల్లింపు గడువును మరో 18 నెలలు పొడిగిస్తారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీకి 25 ఎకరాలు, ఇన్నోవా సొల్యూషన్‌ కంపెనీకి 15 ఎకరాలను పంచేశారు. ఇన్నోవా సొల్యూషన్‌ కంపెనీ లీడర్‌షిప్‌ టీమ్‌లో మంత్రి సన్నిహితులే ఉండడం గమనార్హం. 

10 ఎకరాలు చాలు: సీఎస్‌ 
విశాఖలో రెండు కంపెనీలకు భూకేటాయింపు ప్రతిపాదనలను గత ఏడాది డిసెంబర్‌ 20న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నేతృత్వంలోని రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్‌ఐపీసీ)కి పంపించారు. ఈ ప్రతిపాదనలను చూసి సీఎస్‌ ఆశ్యర్యానికి గురయ్యారు. ఇంత పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత 10 ఎకరాలు మాత్రమే కేటాయించాలని సూచించారు. 

కేబినెట్‌లో ఆమోదముద్ర 
సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ చేసిన సూచనలు, అభ్యంతరాలను ముఖ్యమంత్రి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) లెక్కచేయలేదు. ఎకరం రూ.32.50 లక్షల చొప్పున 40 ఎకరాలను కేటాయిస్తూ, కంపెనీలు కోరిన రాయితీలన్నీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఐటీ విధానానికి విరుద్ధంగా ఉండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవన్న భయంతో ప్రభుత్వ పెద్దలు జనవరి 20న కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement