ఏటీఎంలలో పెట్టకుండానే స్వాహా
ఏజెన్సీ సిబ్బందిలో ఒకరు పరారీ
ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఏటీఎంలలో ఉంచాల్సిన రూ.40 లక్షల మేర నగదును సంబంధిత ఏజెన్సీ ఉద్యోగి స్వాహా చేశారు. ఏటీఎంలో నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన మినీస్టేట్‌మెంట్‌తో సహా ఆ ఉద్యోగి పరారయ్యాడు. ఈ విషయమై సేఫ్‌గార్డ్ ఏజెన్సీ ఆడిటర్ నాగరాజు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉంచే బాధ్యతను రెండేళ్లుగా విజయవాడ కేంద్రంగా ఉన్న రైటర్స్ సేఫ్‌గార్డ్స్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఏటీఎంలలో నగదు ఉంచేందుకు ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన పూరిమిట్ల రవి, కరణం అశోక్‌లను కస్టోడియన్లుగా నియమించుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో సోమవారం మధ్యాహ్నానికే నగదు అయిపోయినట్లు బ్యాంకు అధికారులకు సమాచారం వచ్చింది. ఏజెన్సీకి అందజేసిన నగదుకు, ఏటీఎంల లావాదేవీలకు తేడా వచ్చిందని గమనించిన బ్యాంకు మేనేజర్లు ఏజెన్సీకి తెలిపారు. దీంతో నాగరాజు.. రవి, అశోక్‌లతో కలిసి ఏటీఎంలలో నగదును పరిశీలించారు. ఉండాల్సిన మేరకు నగదు లేదని గమనించిన ఆడిటర్ మినీ స్టేట్‌మెంట్‌ను జిరాక్స్ తీయించుకురమ్మని రవికి ఇచ్చి పంపించారు. రవి మినీ స్టేట్‌మెంట్‌తో సహా పరారయ్యాడు. మొత్తంమీద రూ.39 లక్షల 73 వేలు గోల్‌మాల్ అయినట్టు ఆడిటర్ కనుగొన్నారు. నగదు ఉంచేందుకు ఏటీఎం తెరుచుకోవడానికి కస్టోడియన్లకు పిన్ నంబర్లు ఇస్తారు. అశోక్ పిన్ నంబరు కూడా తెలుసుకుని రవి నగదును అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా ఏటీఎంలలో ఉంచేందుకు బ్యాంకులో నగదు తీసుకునేటప్పుడు కస్టోడియన్లు ఇద్దరూ మేనేజరు సమక్షంలో ఏజెన్సీ నుంచి వచ్చే చెక్కు మీద సంతకం చేయాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రెండో కస్టోడియన్ లేకుండానే పలుమార్లు నగదు తీసుకున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరికే నగదు ఇవ్వడంతో ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.40 లక్షల సొమ్ము మాయం
Published Tue, Mar 18 2014 4:31 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement