కొవ్వూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిసారిగా అగ్నిమాపక శాఖ ద్వారా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ రీజినల్ అగ్నిమాపకశాఖ అధికారి డి.మురళీమోహన్ తెలిపారు. జిల్లాలోని కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం మండలాల పరిధిలోని స్నానఘాట్టాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. కొవ్వూరులో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 400 మంది అగ్నిమాపక సిబ్బందిని ఎంపిక చేసి ఈతలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 30వ తేదీతో శిక్షణ పూర్తవుతుందని, వచ్చేనెల 7న రిహార్సులు నిర్వహిస్తామన్నారు.
వచ్చేనెల 12వ తేదీన సిబ్బందికి విధులు కేటాయిస్తామని తెలిపారు. వీరిలో 200 మంది చురుకైన ఈతగాళ్లను ఎంపిక చేసి నది లోపల బోట్లపై ఉంచుతామన్నారు. పుష్కర నగర్, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆష్కా లైట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పుష్కరనగర్, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి జనరద్దీ ప్రదేశాలలో ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శకటాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 14 ఏ గ్రేడు, 54 బీ గ్రేడు స్నానఘట్టాలను గుర్తించామని ఇక్కడ 600 మంది అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 ఏ గ్రేడు, 64 బీ గ్రేడు స్నానఘట్టాలున్నాయని ఇక్కడ 700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
భక్తుల రక్షణ కోసం తూర్పుగోదావరిలో 13, పశ్చిమగోదావరిలో 10 రబ్బర్ బోట్‌లను వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. స్నానఘట్టాలు శుభ్రం చేసేం దుకు తూర్పుగోదావరిలో 40, పశ్చిమగోదావరిలో 30 పోర్టబుల్ పంప్‌లను వినియోగిస్తామన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఐదు పోర్టబుల్ పంపుసెట్‌లు, నాలుగు రబ్బర్ బోట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఉభయగోదావరి జిల్లాల అగ్నిమాపకశాఖ అధికారులు బి.వీరభద్రరావు, టి.ఉదయ్‌కుమార్, స్ధానిక అగ్నిమాపక అధికారి ఎన్. సుబ్రమణేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఏఈ జి.మణికంఠరాజు ఆయన వెంట ఉన్నారు.
పుష్కరాలకు 400 మంది ఈతగాళ్లు
Published Sat, Jun 27 2015 3:41 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement