జిల్లాలో 42 శాతం ఇంజినీరింగ్ సీట్ల ఖాళీ | 42% seats going empty in Engineering Colleges | Sakshi
Sakshi News home page

జిల్లాలో 42 శాతం ఇంజినీరింగ్ సీట్ల ఖాళీ

Published Mon, Sep 30 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

42% seats going empty in Engineering Colleges

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా 42 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధిత రెండో విడత వెబ్‌ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించారు. కళాశాలల్లోని మొత్తం సీట్లలో 70 శాతం ఎంసెట్ ర్యాంకర్లతో భర్తీ చేయాలి. మిగిలిన 30 శాతం కళాశాల యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు అనుమతించారు. 70 శాతం సీట్లను ఎంసెట్ కన్వీనర్ కోటాలో ర్యాంకులు సాధించిన మెరిట్ విద్యార్థులతో భర్తీ చేస్తారు.
 
 జిల్లాలోని మొత్తం 18 ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా (70 శాతం) ఇంజినీరింగ్ అన్ని విభాగాల కింద మొత్తం 6489 సీట్లుండగా 3792 సీట్లు (58.43 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 26.97 సీట్లు (41.57 శాతం) ఖాళీగా మిగిలిపోయాయి. 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతానికిపైగా, ఏడు కళాశాలల్లో 50 శాతంలోపు భర్తీ అయ్యాయి. వీటిలోని మూడు కళాశాలల్లో పది అంత కంటే తక్కువ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పేస్, రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రస్తుతం రైజ్ గాంధీలో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో 98 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల మూడో స్థానంలో కొనసాగుతుండగా ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కళాశాల ఐదు స్థానాలు ఎగబాకి సీట్ల భర్తీలో నాలుగో స్థానంలో నిలిచింది.
 
 అధిక సంఖ్యలో సివిల్ సీట్ల భర్తీ
 సీట్ల భర్తీలో సివిల్ విభాగం అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలోని 18 కాలేజీల్లోని పదిహేనింటిలో మాత్రమే సివిల్ విభాగం ఉంది. ఈ 15 కళాశాలల్లోని ఎనిమిదింటిలో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ విభాగంలో అత్యధికంగా సీట్లు మిగిలిపోయాయి. ఒక్క కళాశాల్లోనూ ఐటీ సీట్లు వంద శాతం భర్తీ కాలేదు. ఐదు కళాశాలల్లో ఐటీలో అసలు ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఆటోమొబైల్ విభాగం ఒక్క కళాశాలలో మాత్రమే ఉండగా అన్ని సీట్లూ భర్తీ అయ్యాయి. మెకానికల్, ఈసీఈ విభాగాల్లోనూ ఆరు కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్‌లో రారాజులా వెలిగిన సీఎస్‌ఈ విభాగంలో కేవలం మూడు కళాశాలల్లో మాత్రమే అన్ని సీట్లు నిండాయి. ఈఈఈ విభాగంలో మూడు కళాశాలల్లో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
 
 ఇంజినీరింగ్‌పై తగ్గుతున్న ఆసక్తి
 ఇంజినీరింగ్ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకు మార్కెట్లో ఉద్యోగాలు లభించడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు కూడా విద్యార్థులను ఇంజినీరింగ్ విద్యకు దూరం చేస్తున్నాయి. మార్కెట్ అవసరాలకు దీటుగా ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంలో కళాశాలలు విఫలమవుతున్నాయి. ఇంజినీరింగ్ చదివి నిరుద్యోగులుగా మిగిలిపోయే కంటే డిగ్రీ చదవడం మేలని విద్యార్థులు భావిస్తున్నారు. ఫలితంగా ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు మిగిలిపోతున్నాయి.  
 
 జూనియర్ కళాశాలల జిల్లాస్థాయి క్రీడాపోటీలు వాయిదా
 ఒంగోలు స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జూనియర్ కళాశాలల జిల్లాస్థాయి  బాలికల క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో అథ్లెటిక్స్‌తోపాటు అన్ని క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాల్సి ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా పోటీలు వాయిదా వేసినట్లు ఆర్‌ఐఓ పీ మాణిక్యం తెలిపారు. పోటీలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement