
తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు నోటీసులు ఇవ్వనున్నట్టు టీటీడీ తెలిపింది.
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ)లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా సంస్థలో పనిచేస్తున్న 44 మంది అన్యమతస్థులకు ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. సంస్థలో ఉద్యోగులుగా అన్యమతస్తులను కొనసాగించాలా, లేదా అనే అంశంపై ప్రభుత్వంతో చర్చించిన పిదప తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కొద్ది రోజుల క్రితం డిప్యూటీ ఈవో స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లడంతో అన్యమతస్థుల వివాదం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహన వినియోగం అమెను ఈవో వివరణ కోరారు. కాగా, 1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007 లో అప్పటి టీటీడీ పాలకమండలి అన్యమతస్థుల ఉద్యోగాలపై తీర్మానం చేసింది. తీర్మానం చేసిన తర్వాత కూడా ఏడుగురు ఇతర మతస్థులు విధుల్లో చేరారు. కాగా, ఆలయాలు, ఇతర ముఖ్య విభాగాలకు అన్యమతస్థులను దూరంగా ఉంచాలని పీఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు.