భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవం సందర్భంగా భద్రాచలానికి 470 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు భద్రాచలం ఆర్టీసీ డిపో జనరల్ మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు తెలిపారు. భద్రాచలంలో 10, 11వ తేదీలలో జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తరద్వార దర్శన వేడుకల కోసం ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. తన చాంబర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది ముక్కోటితో పాటు సంక్రాంతి పర్వదినం సెలవులు కూడా వస్తుండటంతో భక్తులు, పర్యాటకులు పెద్దసంఖ్యలో భద్రాచలం వచ్చే అవకాశం ఉండటంతో పెద్దమొత్తంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. భద్రాచలం డిపో నుంచి 50 బస్సులు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలకు, ఇల్లెందు నుంచి కొత్తగూడెం మీదుగా భద్రాచలానికి 70 బస్సులు, ఖమ్మం నుంచి కొణిజర్ల, వైరాల మీదుగా 40 బస్సులు, మణుగూరు నుంచి 15, మధిర నుంచి వైరా మీదుగా 16, సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట మీదుగా 14 బస్సులను నడుపుతామన్నారు. కృష్ణాజిల్లా నుంచి 75, గుంటూరు నుంచి 10, ఉభయగోదావరి జిల్లాల నుంచి 78, నల్లగొండ నుంచి ఐదు, వరంగల్ నుంచి 15 సర్వీసులను ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తంగా జిల్లాలో 215, ఇతర జిల్లాల నుంచి 255 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశామన్నారు. గతేడాది ముక్కోటికి ఆర్టీసీకి జిల్లా నుంచి రూ.24.75 లక్షలు వచ్చిందన్నారు. ఈ ఏడాది రూ.30 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాదికంటే టికెట్‌ల ధరలు పెరగడం, సంక్రాంతి సెలువులు కూడా కలిసి వస్తుండటంతో లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చని భావిస్తున్నామన్నారు.
భద్రాచలం బస్టాండ్ నుంచి పావుగంటకో సర్వీస్ చొప్పున దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు బయలుదేరి వెళ్తుందని డీఎం చెప్పారు. డిపోలో ప్రత్యేక టెంట్ వేసి ప్రయాణికులకు బస్సులు-వేళలకు సంబంధించిన సమాచారం తెలిసేలా ప్రకటన చేయిస్తామన్నారు. ఇదే ఏర్పాటు పర్ణశాలలోనూ ఉంటుందన్నారు. ముక్కోటికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులతో మాట్లాడి భద్రాచలం బస్టాండ్‌లో ప్రత్యేక లడ్డూ కౌంటర్‌ను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఆరోగ్యకేంద్రం, ఆర్టీసీ విచారణ కేంద్రం, ప్రత్యేక వాటర్‌ట్యాంక్‌ను సిద్ధం చేశామన్నారు. ప్రయాణికుల కోసం 40 తాత్కాలిక మరుగుదొడ్లను సిద్ధంచేశామన్నారు. ముక్కోటి సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక విధులను అప్పగిస్తున్నట్లు చెప్పారు. డీఎంతో పాటు సీఐ దేవరాజ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ముక్కోటికి 470 ప్రత్యేక బస్సులు
Published Wed, Jan 8 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement