సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా జిల్లా జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీఓ, ఆర్టీసీ, పొలిటికల్, నాన్ పొలిటికల్ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రెండోరోజైన గురువారం కూడా జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అన్నివర్గాల వారూ ఏకమై ‘సమైక్య’శక్తిని చాటారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి.
మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వినూత్న నిరసనలు కొనసాగాయి. మచిలీపట్నంలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. పట్టణ కూరగాయలు, ఆకుకూరలు, నిమ్మకాయల వ్యాపారులు వంటావార్పు నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయశాఖ జేఏసీ ఉద్యోగులు తాడాటతో నిరసన తెలిపారు. గుడివాడ పట్టణంలో భారీ మానవహారం నిర్వహించారు. అన్ని షాపుల యజమానులు, కర్షకులు, ముఠా కార్మికులు ఎక్కడివారు అక్కడే రోడ్లపైకి వచ్చి మానవహారంగా ఏర్పడి సమైక్యవాదానికి మద్దతు తెలిపారు. పామర్రు సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
మైలవరంలో 250 మంది రిలేదీక్ష..
సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో 250 మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీఓ, ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ సమితి అధ్వర్యంలో శత జన రిలే నిరాహార దీక్షకు పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో 250 మంది పాల్గొని మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి షాపులు మూయించారు. జి.కొండూరులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. వీటీపీఎస్ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆటోలు సైతం నిలిపివేయడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. నందిగామలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, బంద్, రిలే నిరాహార దీక్షలతో సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగ కన్వీనర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు..
విద్యుత్ అధికారులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లటంతో ఉద్యమం ఉధృతమైంది. ఈఈ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమ్మెలో పాల్గొనడంతో సేవలు బంద్ అయ్యాయి. జగ్గయ్యపేట పట్టణంలో మున్సిపల్ కూడలి వద్ద అఖిలపక్ష, ఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు పట్టణంలో రోడ్లపై వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరులో విద్యార్ధులు ఎంఎన్‌కే రహదారిపై ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఆడి నిరసన తెలిపారు. నందివాడ మండలంలోని జనార్థనపురం శివారు టెలిఫోన్‌నగర్ కాలనీలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు ఎంఎన్‌కే రహదారిపై పొర్లుదండాలు పెట్టి వినూత్న నిరసన చేపట్టారు.
గుడివాడలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నెలరోజులు గడిచిన నేపథ్యంలో ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్లపై భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి దిగారు. 72 గంటల పాటు సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. సమ్మెలోకి దిగిన ఎన్టీటీపీఎస్ ఉద్యోగులందరూ గురువారం ఉదయం 6 గంటలకల్లా థర్మల్ కేంద్రానికి వచ్చి మూడు గేట్లను మూసి వేయించి ఉద్యోగులు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
పెడన పట్టణంలో జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బంటుమిల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పామర్రులో షటిల్ ఫ్రెండ్స్‌సర్కిల్ వారి ఆధ్వర్యంలో జాతీయరహదారిపై బ్యాడ్మింటన్ ఆడి తమ నిరసన తెలిపారు. విజయవాడలో రెండురోజుల విజయవంతమైంది. బైక్‌ర్యాలీలు, వంటావార్పు, మానవహారాలు, రిలేదీక్షలతో నిరసనలు తెలిపారు. సివిల్ సప్లయిస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఎన్జీవో జేఏసీ నాయకులు జేసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
‘సమైక్య’శక్తి
Published Fri, Sep 13 2013 3:04 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement