సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ పశ్చిమ శివారులోని ఇబ్రహీంపట్నం నుంచి తూర్పు శివారులోని గుణదల వరకు.. ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాలు, ఖాళీ స్థలాల అన్యాక్రాంతానికి తెరలేచింది. విజయవాడలోని స్వరాజ్ మైదానం, స్టేట్ గెస్ట్ హౌస్, డీజీపీ పాత కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్, గుణదలలోని ట్రాన్స్‌కో భూములు.. ఇలా మొత్తం 49 ఎకరాల ప్రభుత్వ భూములను పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేటు సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు. భూ వినియోగ మార్పిడి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఆర్‌డీయే పర్యవేక్షణలో విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకు అడ్డంకిగా ఉన్న నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌ను సవరిస్తూ తీర్మానం చేసింది. ఈ 49 ఎకరాల మార్కెట్ విలువ సుమారు రూ.6,500 కోట్లు కావడం గమనార్హం.
మాస్టర్ ప్లాన్‌నే మార్చేశారు..
నదీముఖ ద్వార పర్యాటక ప్రాజెక్టులు, సిటీ స్క్వేర్, స్టార్ హాటళ్ల పేరిట నగరం నడిబొడ్డున, కృష్ణా నది తీరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. అయితే ఆ భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు విజయవాడ నగర పాలక సంస్థ జోనల్ అభివృద్ధి ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) ప్రతిబంధకంగా నిలిచింది. మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయినా చేపట్టాలి. ప్రభుత్వ భూములను ఏ వినియోగం కోసమైతే నిర్దేశించారో వాటికే ఉపయోగించాలి. ప్రభుత్వ పెద్దలు కన్నేసిన భూములు కూడా మాస్టర్‌ప్లాన్‌లో పబ్లిక్, సెమీ పబ్లిక్ అనే కేటగిరీల కిందే ఉన్నాయి. అంటే వాటిని ప్రభుత్వ, ప్రజోపయోగ పనుల నిమిత్తమే ఉపయోగించాలి. ఇతర అవసరాలకు కేటాయించకూడదు. ఈ నేపథ్యంలో ఏకంగా విజయవాడ నగర పాలక సంస్థ మాస్టర్ ప్లాన్‌నే సవరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో...
సీఎం గత ఆగస్టు 30న సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న భూములను వినియోగ మార్పిడి చేయాలని ఆదేశించారు. పబ్లిక్, సెమీ పబ్లిక్ కేటగిరీల కింద పేర్కొన్న భూములను ‘మిక్స్‌డ్’ కేటగిరీలోకి మార్చాలని సూచించారు. పంచాయతీరాజ్, నగర పాలక సంస్థల చట్టం ప్రకారం స్థానిక సంస్థల పాలకమండళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి భూ వినియోగ మార్పిడి చేయాలని ఆదేశించడం గమనార్హం.
మిక్స్‌డ్ కేటగిరీలోకి మారుస్తూ తీర్మానం
నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడాల్సిన వీఎంసీ పాలకమండలి ముఖ్యమంత్రి అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించింది. గత సెప్టెంబర్ 15న సÐమావేశం నిర్వహించి.. మాస్టర్‌ప్లాన్‌లో పబ్లిక్, సెమీ పబ్లిక్ కేటగిరీల కింద పేర్కొన్న భూములు 49 ఎకరాలను మిక్స్‌డ్ కేటగిరీలోకి మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అంతకుముందు నగర పాలక సంస్థకు చెందిన 82 సెంట్ల భూమిని మినహాయించాలని కోరింనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు అ«ధ్యక్షుడిగా ఉన్న అమరావతి అభివృద్ధి మండలి (ఏడీసీ) ససేమిరా అంది. ప్రభుత్వ భూములను మాస్టర్‌ప్లాన్‌లో మిక్స్‌డ్ కేటగిరీలోకి మార్చడంతో ప్రభుత్వ పెద్దల పన్నాగానికి మార్గం సుగమమైంది. వీఎంసీ తీర్మానానికి త్వరలోనే సీఆర్‌డీయే రాజముద్ర వేయనుంది. అనంతరం ఏడీసీ ద్వారా ఆ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే తతంగం పూర్తి కానుందని అధికార వర్గాల సమాచారం. అయితే ప్రైవేటు సంస్థల ముసుగులో బినామీలకే ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ స్క్వేర్ నిర్మాణం కోసం స్వరాజ్ మైదానాన్ని చైనాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ సంస్థలో పబ్లిక్ షేర్స్ పేరిట పలువురు వాటాదారులు ఉన్నారని, వారంతా ప్రభుత్వ పెద్దల బినామీలేనని అధికారవర్గాల సమాచారం. ఇదే విధంగా ఇతర భూములను కూడా బినామీలు చక్రం తిప్పే సంస్థలకే కట్టబెడతారని తెలుస్తోంది.
భవిష్యత్‌లో ఇవి కూడా..?
భవిష్యత్‌లో విజయవాడలోని మరో 12.34 ఎకరాలను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. బృందావన్ కాలనీ మున్సిపల్ క్వార్టర్స్, హనుమాన్‌పేట మున్సిపల్ పాఠశాల, కబేళా సమీపంలోని మున్సిపల్ స్థలం మొదలైనవి ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.
వీఎంసీ మాస్టర్‌ప్లాన్‌లో మిక్స్‌డ్ కేటగిరీలోకి మార్చిన ప్రభుత్వ భూముల జాబితా ఇదీ...
1) స్వరాజ్ మైదానం, విస్తీర్ణం: 20 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.3,000కోట్లు
2) స్టేట్ గెస్ట్ హౌస్, డీజీపీ పాత కార్యాలయం, విస్తీర్ణం: 6 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.900కోట్లు
3) విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం, పాలకమండలి సమావేశ మందిరం, విస్తీర్ణం: 3.22 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.322కోట్లు
4) విద్యుత్ సబ్‌స్టేషన్, మున్సిపల్ రోడ్డు, విస్తీర్ణం: 1.13 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.113కోట్లు
5) రాజీవ్‌గాంధీ పార్కు, విస్తీర్ణం: 9 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.900కోట్లు
6) విద్యుత్ సబ్‌స్టేషన్ (బందరు రోడ్డు), విస్తీర్ణం: 1.14 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.171కోట్లు
7) పాత పోలీస్ క్వార్టర్స్ (సీతమ్మవారి పాదాలు ప్రాంతం), విస్తీర్ణం: 2.90 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ.290కోట్లు
8) హోల్‌సేల్ కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, విద్యుత్ కార్యాలయం రోడ్డు (బందరు రోడ్డును ఆనుకుని), విస్తీర్ణం: 5.54 ఎకరాలు, మార్కెట్ విలువ: రూ. 831కోట్లు
Comments
Please login to add a commentAdd a comment