వేదఘోషతో మార్మోగిన స్వరాజ్య మైదానం
విజయవాడ కల్చరల్ :
స్థానిక స్వరాజ్య మైదానం మంగళవారం వేదఘోషతో మర్మోగింది. స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీ వేంకటేశ్వరుని నమూనా దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన దేవాలయంలో శ్రీవారికి తిరుమలలో నిర్వహించిన సేవలన్నీ ఇక్కడ కొనసాగుతున్నాయి. మంగళవారం టీటీడీ ఆస్థాన మంగళవాద్య కళాకారుల నాదధ్వనితో శ్రీవారి ప్రాతఃకాల సేవలు ప్రారంభమయ్యాయి. విష్ణుసహస్రనామ పారాయణం, వేద పారాయణం, అనంతరం ఘన స్వస్తి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు దేవదేవుని దర్శించుకోవటానికి ఆసక్తి చూపారు. సాయంత్రం వేదసభ, అనంతరం స్వామి వారికి ఊంజల్ సేవను నిర్వహించారు. చివరిగా అన్నమాచార్య, దాససేవా ప్రాజెక్ట్ సంస్థ సభ్యులు అన్నమాచార్య గీతాలను ఆలపించారు.