పెను విషాదం
Published Wed, Oct 16 2013 1:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పండగ శోభ ఇంకా తగ్గలేదు. దసరా సందడి ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే ఓ దుర్వార్త అయిదు కుటుంబాలను వణికించింది. బెజవాడ కనకదుర్గ దర్శనానికి టవేరా వాహనంలో బయల్దేరిన వారిలో అయిదుగురు రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతుల్లో నలుగురు యువకులే. సోమవారం రాత్రి డ్రైవర్‌తో సహా తొమ్మిది మంది పెదగంట్యాడ కొత్త కర్ణవానిపాలెం నుంచి బయల్దేరారు. మంగళవారం వేకువజామున తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జాతీయరహదారి సమీపంలోని సుద్దకొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో శివకుమార్, రమేష్, అప్పల శ్రీను, శ్రీనివాసరావుతో పాటు వాహనం డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో శ్రీనివాసరావుకు అయిదు నెలల క్రితమే వివాహమైంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
దుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరిన భవానీ భక్తులు మార్గంమధ్యలో రోడ్డు ప్రమాదంలో అశువులు బాశారు. రాజమండ్రి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదంలో పెదగంట్యాడ మండలం కొత్త కర్ణవానిపాలెం గ్రామానికి చెందిన నలుగురు, ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్‌కు చెందిన వాహన డ్రైవర్ దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కొత్త కర్ణవానిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. న్యూస్‌లైన్, పెదగంట్యాడ
దేవీనవరాత్రుల సందర్భంగా గ్రామానికి చెందిన గొన్న శివకుమార్(26), గద్దె శ్రీనివాసరావు (27), వెంకటేష్ (24), వానపల్లి అప్పలరాజు (24)లు భవానీ మాలలు ధరించారు. సోమవారం రాత్రి అనుపోత్సవం నిర్వహించి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. వారితో పాటు యర్రా రమేష్(26), విరోతి అప్పలశ్రీను (28) అతని భార్య శిరీష (23), చిననడుపూరు గ్రామానికి చెందిన గురుభవానీ పగడాల జోగారావు (45), ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్ చెందిన దమన్‌సింగ్ శంకర్(26) (డ్రైవర్) టవేర వాహనంలో ప్రయాణిస్తూ తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జాతీయరహదారి సమీపంలోని సుద్దకొండ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో శివకుమార్, రమేష్, అప్పలశ్రీను, శ్రీనివాసరావుతో పాటు వాహనం డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఆందోళనలో
కుటుంబసభ్యులు
విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు సంఘటన స్థలానికి పయనమయ్యారు. కొందరు ఇంటి వద్దే ఉంటూ సమాచారం తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులు రాజ మండ్రి, కాకినాడలోని ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువులు, స్నేహితుల పరామర్శలతో కొత్త కర్ణవానిపాలెంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
పెద్ద దిక్కు దూరం.. దేవునిదే భారం
యర్రా రమేష్ దుర్మరణంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండ్రి దేముడు పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి వెంకయ్యమ్మ ఇతర అనారోగ్య కారణాలతో సతమతమవుతుంది. రమేష్‌కు పదో తరగతి చదువుతున్న తమ్ముడు నగేష్ ఉన్నాడు. షిప్‌యార్డులో ఓ ప్రైవేటు ఫ్యాబ్రికేషన్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రమేష్ మరణించినట్టు తల్లిదండ్రులకు తెలియపర్చలేదు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సోదరుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన తరుణం
గొన్నా శివకుమార్ ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని మరణ వార్త వారిని కలిచివేసింది. అతని తల్లిదండ్రులు రామారావు, అప్పలనర్సమ్మ గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రామారావుకు కుమార్తె భాగ్యలక్ష్మితో పాటు శివకుమార్, కనకరాజు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. రెండో కుమారుడైన కనకరాజు బీకాం చదువుతున్నాడు.
వివాహమైన ఐదు నెలలకే..
రెండేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన గద్దె శ్రీనివాసరావుకు ఈ ఏడాది మే 30న కశింకోట గ్రామానికి చెందిన నాగమణితో వివాహమైంది. ప్రస్తుతం ఫార్మాసిటీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు మరణవార్తతో అతని భార్య నాగమణి రోదనలు అక్కడివారిని కలచివేసింది. అల్లుడు మరణంతో నాగమణి తల్లిదండ్రులు ఉషారత్నం, గోవింద్‌రాజు కుమార్తెను పట్టుకొని గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ప్రమాదంలో శ్రీనివాసరావు సోదరుడు వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి.
దుఃఖసాగరంలో శ్రీను కుటుంబం
స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విరోతి అప్పల శ్రీను, శిరీషకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రమాదంలో అతడు దుర్మరణం పాలవ్వగా, శిరీష తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు దేముడు, వరహాలమ్మ అనారోగ్యంతో ఉండడం వల్ల కుమారుని మరణవార్త వారికి చెప్పలేదు. కర్ణవానిపాలేనికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు ప్రమాదాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. కుటుంబసభ్యులు హుటాహుటిన రాజమండ్రికి తరలివెళ్లారు.
మృత్యు శకటాలు
మర్రిపాలెం, న్యూస్‌లైన్ : ప్రమోదంగా సాగాల్సిన ప్రయాణం ప్రమాదభరితంగా మారుతోంది. జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహ నాలు జనం ఉసురు తీస్తున్నాయి. నిత్యం రహదారులకు రక్తతర్పణం చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను అనాథలను చేసి నడిరోడ్డున పడేస్తున్నాయి. అయినా అధికారులు మొద్దు నిద్ర వీడడంలేదు. రహదారి నిబంధనలను కఠినంగా అమలుపరచడం లేదు. దీంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని నెలల క్రితం నక్కపల్లిలో ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో నగరానికి చెందిన నలుగురు యువకులు బల య్యారు. ఇటీవల ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో విశాఖకు చెందిన బాపట్ల మున్సిపల్ కమిషనర్ దుర్మరణం చెందారు. మంగళవారం రాజమండ్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడం తో విశాఖకు చెందిన ఐదుగురు మృతి చెందారు.
హైవేపై వాహనాల పార్కింగ్
జాతీయ రహదారిపై ఇష్టానుసారంగా నిలిపే వాహనాల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా లారీలను రోడ్డుకు అ డ్డం గా, కాస్త పక్కగా ఆపేసి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అతి వేగంతో వచ్చే వాహనాలు గమనించక ప్రమాదాలకు గురవుతున్నాయి.
పర్యవేక్ష ణ లోపం పోలీస్ పెట్రోలింగ్, హైవే అథారిటీ సిబ్బంది రోడ్లను నిరంతరం పర్యవేక్షించాలి. రోడ్డు పక్క గా నిలిపి ఉన్న వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు నో పార్కింగ్ కేసులు నమోదు చేయాలి. కానీ అలా జరగడం లేదు. రోడ్డుకు ఆనుకొని వెలసిన హోటల్స్, దాబాలు, రె స్టారెంట్లు, మద్యం షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేసినా చూసీచూడనట్టు వ్యవహరిసున్నారు. కాసులకు కక్కు ర్తి పడే మిన్నకుంటున్నారని ఆరోపణలు ఉన్నా యి. వీరు తమ విధుల్లో కాస్త కఠినంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
Advertisement
Advertisement