
53 మంది మృతి: రూ.3,756 కోట్లు నష్టం
భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 53 మంది మృతి చెందారు.
హైదరాబాద్: భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 53 మంది మృతి చెందారు. ఆరుగురు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది చనిపోయారు. నల్గొండలో ఏడుగురు, మహబూబ్నగర్లో ఆరుగురు మృతి చెందారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు మొత్తం 42,071 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే 12వేల ఇళ్లు కూలిపోయాయి. 2,20,245 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 384 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11లక్షల 37వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 1786 పశువులు మృతి చెందాయి. 1,409 చెరువులకు గండ్లు పడ్డాయి. 1500 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 3,756 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించింది.
ఇదిలా ఉండగా, కోస్తా, రాయలసీమ, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీవర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. 16 జిల్లాల్లో 567 మండలాల్లో 5,186 గ్రామాలకు వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు.