చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి కేకలు సర్కారును కదిలించలేకపోతున్నాయి. ఫ్యాక్టరీ మూతతో మనోవేదనకు గురై.. అనారోగ్యం పాలై.. సరైన వైద్యం చేయించుకోలేక ఆరుగురు ప్రాణాలొదిలినా.. ఆర్థిక ఇబ్బందులతో 750 కుటుంబాలు సతమతమవుతున్నా.. ప్రభుత్వం, యాజమాన్యం చలించడం లేదు. కార్మికులకు బకాయిలు చెల్లించడం లేదు. ఫ్యాక్టరీని తెరిపించే యత్నమూ చేయడం లేదు.
పశ్చిమగోదావరి కొవ్వూరు: చాగల్లు వీవీఎస్ షుగర్స్ (వెలగపూడి వెంకట సుబ్బయ్య షుగర్స్) ఫ్యాక్టరీని ది జైపూర్ షుగర్స్ కంపెనీ లిమిటెడ్ 1961లో స్థాపించింది. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ ఇది. దీనికి అనుబంధంగా చాగల్లు, జంగారెడ్డిగూడెం డిస్టిలరీలు ఉన్నాయి. పోతవరంలో మరో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మొత్తమ్మీద ఈ నాలుగు పరిశ్రమల్లో సుమారు 750 మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేసేవారు.
ఫ్యాక్టరీ అధికారులే గుల్ల చేశారా!
గతంలో చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన కొందరు ఫ్యాక్టరీ అధికారులు దీనిని గుల్లచేశారు. 2009లో రైతుల టైఅప్ రుణాల కుంభకోణంలో ఆ సంస్థ యాజమాన్యం వార్తలకెక్కింది. 2010లో ఈ సంస్థలో పనిచేస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై పంచదార కుంభకోణానికి పాల్పడ్డారు. రూ. 1.13 కోట్ల విలువైన (అప్పటి ధర ప్రకారం) 3,792 క్వింటాళ్ల పంచదారను అక్రమంగా బయటకు తరలించి సొమ్ము చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న 16 మందిలో ఏడుగురు సంస్థ అధికారులు ఉన్నారు. తర్వాత మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇలా ఈ పరిశ్రమను కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకున్నారు.
బకాయిలు పేరుకుపోయాయి
2014–15, 2015–16 క్రషింగ్ సీజన్‌కి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.40 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైతులు ఆందోళనకు దిగడంతో ఫ్యాక్టరీలోని పంచదార నిల్వలను విక్రయించి విడతల వారీగా సగం బకాయిలు చెల్లించారు. ఇంకా సుమారు రూ.19 కోట్లు చెల్లించాలి. దీంతో గత ఏడాది క్రషింగ్ ప్రక్రియ నిలిపివేశారు. రెవెన్యూ అధికారులు రైతుల బకాయిలు రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్యాక్టరీని వేలం వేసేందుకు అధికారులు మూడు సార్లు యత్నించినా పాటదారులు రాకపోవడంతో ఫ్యాక్టరీని ఈ ఏడాది జనవరి 20న మూసివేశారు.
ఆందోళన బాటలో కార్మికులు
ప్రస్తుతం ది జైపూర్ షుగర్స్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు మూడేళ్ల నుంచి వివిధ రాయితీలు, గత ఏడాది నవంబర్ నుంచి జీతాలు చెల్లించడం లేదు. ఈ అన్ని బకాయిలు కలిపి సుమారు రూ.15 కోట్ల వరకూ ఉంటాయి. దీంతో కార్మికులు ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘం నేతలు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణను పలుమార్లు కలవడంతో ఇటీవల రెండు నెలలు జీతం మాత్రం విదిల్చారు.
ఆరుగురు ప్రాణాలొదిలారు
సంస్థ మూతపడడం, జీతాలు, ఇతర బెనిఫిట్స్ నిలిచిపోవడంతో మనోవ్యధకు గురై.. అనారోగ్యం బారిన పడి సకాలంలో సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఆరుగురు కార్మికులు మరణించారు. ఫీల్డ్ మేన్ నల్లూరి శ్రీని వాసరావు, ఫిట్టర్లు ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్‌ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో ప్రాణాలొదిలారు. రిటైర్ అయిన ఆత్కూరి కృష్ణమూర్తి పీఎఫ్, ఇతర బెనిఫిట్స్ అందకుండానే మరణించారు.
పట్టని ప్రభుత్వం
కార్మికులు 45 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇంత వరకు రైతుల బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులూ కష్టాలు పడుతున్నారు.
ఈయన పేరు డి.సువర్ణరాజు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనిది కర్ణాటకలోని రాయగఢ్. ఉపాధి కోసం నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, తల్లి ఉన్నారు. వీరంతా సువర్ణరాజుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఫ్యాక్టరీ మూత పడడంతో 11 నెలల నుంచి జీతాల్లేవు. ఇంతలో షుగర్ వ్యాధి బయటపడింది. వ్యాధి ముదరడంతో ఐదునెలల కిత్రం ఆయన కాలు సగం తొలగించారు. ఇద్దరు కుమార్తెలకూ ఇంకా వివాహాలు కాలేదు. చదువులూ పూర్తి కాలేదు. కుమారుడు సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పుడు సువర్ణరాజు కుటుంబం పుట్టెడు కష్టాల్లో మునిగింది.
ఈ చిత్రంలో గోడ మీదున్న ఫొటోలోని వ్యక్తి పేరు వీవీఎల్‌ఎన్ ఆచార్యులు. చాగల్లు ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 5న గుండెపోటుతో మరణించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. వీరందరికీ ఈయనే ఆధారం. ఫ్యాక్టరీ మూతపడడం, జీతాల్లేకపోవడంతో ఆచార్యులు మానసికంగా కుంగిపోయి తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఒత్తిడి ఎక్కువై గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు ఈయన కుటుంబం వీధిన పడింది. ఫ్యాక్టరీ నుంచి అందాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్, ఇతర లబ్ధి ఏమీ అందకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవీ ఈ రెండు కుటుంబాల కన్నీటి గాథలు.. ఇవే కాదు.. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులను కదిపి చూస్తే ఇలాంటి విషాద గాథలెన్నో వినబడతాయి. జీతాలు రాక, పీఎఫ్, ఇతర లబ్ధి అందక ఆ కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీ మూత పడి.. కుటుంబాల జీవనం గగనంగా మారడంతో మానసిక వేదనకు గురై 9 నెలల్లో ఆరుగురు కార్మికులు మరణించారు. అయినా యాజమాన్యంతోపాటు సర్కారులోనూ చలనం లేదు. ఫలితంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు.
మూడేళ్ల నుంచి ముప్పుతిప్పలు
♦ ఫ్యాక్టరీ సంక్షోభంలో ఉండడంతో మూడేళ్ల నుంచి యాజమాన్యం కార్మికులను ముప్పుతిప్పలు పెడుతోంది.
♦ గత రెండున్నరేళ్ల నుంచి బోనస్‌లు ఇవ్వడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటాయి.
♦ వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి ఏడాదికి ఇచ్చే రూ.10వేలను మూడేళ్ల నుంచి చెల్లించడం లేదు.
♦ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ , ఓవర్ టైమ్ వేతనాలను 2014–15 నుంచి చెల్లించడం లేదు.
♦ ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు. ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం, సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్‌లదీ అదే పరిస్థితి.
♦ 2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కట్టటం లేదు. ఉద్యోగులు, కార్మికుల వాటాగా చెల్లించేది మాత్రం 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లిస్తూ వచ్చారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు ఫీఎఫ్ రావటం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం వాటా చెల్లిస్తేగానీ ఫీఎఫ్ సొమ్ము కార్మికులకు అందే వీలు లేదు.
♦ కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీలో నిల్వలో ఉన్న రూ.80 లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీనిపై కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షల చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్‌లోపు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ రూ.10లక్షలు మాత్రమే జమ చేసింది. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఈ సొమ్ములు కార్మికులు, ఉద్యోగులు రుణాలు తీసుకునేవారు. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.