పిఠాపురం : అన్ని వర్గాల విద్యాభివృద్ధే ధ్యేయం అంటూ ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం ఆ విషయంలో మైనార్టీలకు మొండి చేయి చూపుతోంది.
పిఠాపురం : అన్ని వర్గాల విద్యాభివృద్ధే ధ్యేయం అంటూ ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం ఆ విషయంలో మైనార్టీలకు మొండి చేయి చూపుతోంది. ఉపాధ్యాయులు లేక, విద్యాబోధన జరగక ఉర్దూ పాఠశాలలు వెనకబడుతుంటే, వాటి స్థితిగతులను మెరుగుపరచడం మాని, మూసివేసే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో అనేక ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్న వాస్తవాన్ని పట్టించుకోకుండా మొన్నటి డీఎస్సీలో ఉర్దూ ఉపాధ్యాయుల భర్తీలో మొండిచేయి చూపింది. జిల్లాలో 57 ఉర్దూ పాఠశాలలు ఉండగా ఉపాధ్యాయులు 42 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరు ఇటీవల ఇతర తెలుగు మీడియం పాఠశాలలకు బదిలీ కాగా, కొంత మంది పదవీ విరమణలు చేయడంతో 12 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇక 30 మంది మాత్రమే ఉర్దూ ఉపాధ్యాయులున్నారు.
ఈ దశలో జిల్లాలో 27 పాఠశాలల్లో అసలు ఉర్దూ ఉపాధ్యాయులే లేక ఉర్దూ బోధన నిలిచిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే.. జిల్లాకు డీఎస్సీలో ఒకే ఒక్క ఉర్దూ ఉపాధ్యాయ పోస్టు కేటాయించారు. ఉపాధ్యాయుల కొరత సాకుగా చూపించి ఉర్దూ పాఠశాలలను మూసివేయాలన్న పన్నాగంతోనే ప్రభుత్వం ఇలా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఉర్దూ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం తప్ప విద్యా బోధన కనీసంగా సాగేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం ఎవరి పుస్తకాలు వారే చదువుకోవడం తప్పఅనుమానాలను నివృత్తి చేసే వారు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉర్దూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని బయట పెట్టకుండా గోప్యంగా ఉంచడం కూడా ఈ పాఠశాలల మూసివేతకు ఎత్తుగడలో భాగమేనని మైనారిటీ వర్గాల వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా.. ఇలాంటి కుయుక్తిని విడనాడి, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.
పుస్తకాలిచ్చి చదువుకోమంటున్నారు
మాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కేవలం పుస్తకాలు ఇచ్చి చదువుకోమంటున్నారు. దాని వల్ల ఏమీ తెలియడం లేదు. అంతా తెలుగులోనే చెబుతున్నారు.
- అన్సర్, 5వ తరగతి విద్యార్థి,
ఉర్దూ పాఠశాల, పిఠాపురం
ఏమీ అర్థం కావడం లేదు..
ఉపాధ్యాయులు లేక ఉర్దూ ఏమీ అర్థం కావడం లేదు. ఎవరినైనా అడుగుదామన్నా చెప్పేవారు లేరు. మొక్కుబడిగా పాఠశాలకు వెళ్లి వస్తున్నాం. తెలుగు మాత్రమే నేర్చుకుంటున్నాం.
- బషీరమ్మ, 5వ తరగతి విద్యార్థిని,
ఉర్దూ పాఠశాల, పిఠాపురం
భర్తీకి చర్యలు తీసుకుంటాం..
ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. 27 పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత ఉంది. అయినా పాఠశాలలు కొనసాగుతాయి. పాఠ్యపుస్తకాలు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం.
- మహమ్మద్ రజాక్,
సర్వశిక్షాభియాన్ ఉర్దూ ఏఎంఓ, కాకినాడ