జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) సమావేశం ఏడో తేదీన జరుగుతున్నందున దానికి నిరసనగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేవిధంగా పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌ను బలపర్చేందుకు 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలు పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 49 మండలాల్లో అన్నిచోట్ల ఈ కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు.
6, 7 తేదీల్లో రోడ్ల దిగ్బంధం : భాను
Published Tue, Nov 5 2013 1:57 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement