నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ దొంగతనం జరిగింది. చెన్నైకి చెందిన ఓ బంగారు ఆభరణాల సంస్థలో పనిచేస్తున్న సెంథిల్, మహేందర్ అనే వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 14 కిలోల బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు వచ్చారు. పని ముగించుకుని కొంత బంగారం తీసుకుని వారు బుధవారం రాత్రి కేశినేని ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలు దేరారు. గురువారం ఉదయం ఆ బస్సు నెల్లూరు జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో టిఫన్ కోసం బస్సు ఆగింది. అనంతరం తిరిగి బస్సు బయలుదేరుతుండగా సెంథిల్, మహేందర్ తమ బ్యాగ్ ఒకటి కనిపించటం లేదని బస్సు డ్రైవర్‌కు చెప్పారు.
దీంతో బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన బ్యాగులో ఆరు కిలోల బంగారు ఆభరణాలున్నాయని సెంథిల్, మహేందర్ చెబుతున్నారు. సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి ఒక వ్యక్తి హడావిడిగా ఓ బ్యాగుతో బస్సు దిగి, కారులో వెళ్లిపోయాడని బస్సు క్లీనర్ పోలీసులకు తెలిపాడు. బస్సులోని ప్రయాణికుల వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు.