naidupet
-
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
సాక్షి, నాయుడుపేటటౌన్: పట్టపగలు జనసంచారం ఉండే ప్రాంతంలో ఓ మహిళ చేతి సంచిలోని ఆమెకు సైతం తెలియకుండా సినీ ఫక్కీలో చోరీ చేశారు. అందులో రూ.3.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితురాలి సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాజికండ్రిగకు చెందిన లొడారి అంకమ్మ పట్ట ణంలోని ఓ ఇంటి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగా ఇచ్చేందుకు రూ.3.90 లక్షలు తీసుకుని ఆమె సమీప బంధువు పి.శారదమ్మతో కలిసి సర్వీస్ ఆటోలో నాయుడుపేటకు వచ్చింది. పాతబస్టాండ్ వద్ద దిగి పూలు, వస్తువులు కొనుగోలు చేసి పట్టణంలోని ఆ మె కుమార్తె ఇంటికి వెళ్లానుకుంది. అయితే అంకమ్మ పాతబస్టాండ్ వద్ద పూలమొక్కలు విక్రయించే దుకా ణం వద్ద కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమె చేతికి రక్తం కారుతుండడాన్ని గమనించి ఆమెకు చెప్పాడు. అప్పుడు అంకమ్మ ఆమె చేతిలో నగదు భద్రపరచి ఉన్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ గగ్గోలు పెట్టింది. ఆమెకు కూడా తెలియకుండా పదునైన బ్లేడుతో సంచిని కోసి నగదు సంచిని దోచుకెళ్లినట్లుగా గుర్తించింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూ. 3.90 లక్షలు చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జీ వేణు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పాతబస్టాండ్ వద్ద బాధితురాలు వెళ్లిన పలు ప్రదేశాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఆధారాలు దొరకలేదు. పట్టణంలోని దర్గావీధి ప్రాంతాల్లో ఆటోకు సంబంధించి సీసీ ఫుటేజీలను పోలీసులు రికార్డు చేసుకొని పరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్బీహెచ్ ఏటీఎం ధ్వంసం
నాయుడుపేట టౌన్ : నెల్లూరు జిల్లా నాయుడుపేట టౌన్‌లోని ఎస్బీహెచ్ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటీఎం గదిలోని సీసీ కెమెరా వైర్లను కూడా కత్తిరించిన దుండగులు ఏటీఎం ధ్వంసం చేసి క్యాష్ లాకర్‌ను తెరిచేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైనట్లుగా తెలుస్తోంది. స్థానికులు ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక సీఐ రత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. -
మాలయకోటలో పేలిన తూటాలు
► పెద్ద శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు ► పోలీసులు విస్తృతంగా తనిఖీలు ► అడవి జంతువులకు పెట్టే తూటాలుగా నిర్ధారణ నాయుడుపేట : పట్టణ శివారు ప్రాంతం మాలయకోట (మునిరత్నంనగర్)లో సోమవారం సాయంత్రం పెద్ద శబ్దంతో రెండు తూటాలు పేలాయి. పేలుడు శబ్ధానికి ఇళ్లలో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. నడిబజారులో జరిగిన ఈ ఘటనలో ఓ వీధి కుక్క నోటి వద్ద గాయపడి ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణనష్టం జరిగిందోనని, ఎవరికి ఏమైందోనని ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. స్థానికుల సమాచారం మేరకు.. మాలయకోటలో సాయంత్రం 5 గంటల సమయంలో ఓ కుక్క అక్కడ పడి ఉన్న ప్లాస్లిక్ సంచిలో పేగులను తినే క్రమంలో పెద్ద శబ్దంతో తూటా పేలింది. దీంతో కుక్క రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే మరో తూటా పడి ఉండటంతో స్థానికులు అది కూడా పేలుతుందని భావించి నిర్వీర్యం చేసేందుకు నీళ్లల్లో వేసేందుకు తీసుకెళ్లారు. అయితే మళ్లీ దూరంగా పెట్టి దానిపై ఇటుక రాయి విసిరారు. దీంతో అది కూడా పేలి, దాని ధాటికి ఇటుక రాయి ముక్కలుముక్కలైంది. పోలీసులు పరుగులు మునిరత్నంనగర్‌లో బాంబులు పేలాయంటూ పోలీసులకు సమాచారం అందడటంతో సీఐ రత్తయ్య, పెళ్లకూరు, దొరవారిసత్రం ఎస్సైలు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న శునకాన్ని పరిశీలించారు. పక్కనే పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు అందులో ఉన్న పేగులను గుర్తించారు. శునకానికి నలువైపుల ఉన్న దారపు పీసులను క్షుణ్ణంగా పరిశీలించారు. పేలింది నాటు బాంబు కాదని పంటలు నాశనం చేసే అటవీ జంతువుల కోసం రైతులు పెట్టే తూటాలుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు ఘటన స్థలానికి సమీపంలో ఉన్న పలువురి ఇళ్లల్లోని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మాలయకోటలోని ప్రతి ఇంటిని సీఐ రత్తయ్య ఆధ్వర్యంలో మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజనీరిగ్ సీటు ఇప్పిస్తానని మోసం
నాయుడుపేట : ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానని చెప్పి కళాశాలకు చెందిన దళారి మోసం చేసిన సంఘటన నాయుడుపేటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మమ్మ కుమార్తె బందిల మణెమ్మ డక్కిలి గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షలో 99,731 ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులను శరవణన్ అనే యువకుడు కలిసి ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా సీటు, వసతి సదుపాయం కల్పిస్తామని వారిని నమ్మబలికాడు. దీంతో వారు మణెమ్మ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణపత్రాలతో పాటు అర్హత పొందిన జాబితాను అతడికిచ్చారు. మణెమ్మ మొదటి, మూడో కౌన్సెలింగ్లకు హాజరై ఆదిశంకర విద్యాసంస్థలో సీటు కావాలని దరఖాస్తు చేసుకుంది. అయితే శరవణన్ ఆప్షన్ పెట్టేందుకు ఇచ్చే పాస్వర్డ్ తెలుసుకుని ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఏబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలను రెండో ఆప్షన్‌గా పెట్టాడు. అధికారులు ఏబీఆర్లో సీటు ఇస్తామని చెప్పారు. అందులో చేరడం ఇష్టంలేని మణెమ్మ తల్లిదండ్రులు శరవణన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. అతను ఏబీఆర్ కాలేజీలో ఉన్నాయి. అక్కడికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో వారు మోసపోయామని గ్రహించారు. కళాశాల యాజమాన్యాన్ని కలిసి తమ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. వారు రూ.30 వేలు ఇస్తే సర్టిఫికట్లు ఇస్తామని చెప్పడంతో బాధితులు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీకి ఈ నెల 22వ తేదీన గ్రీవెన్‌సెల్‌లో ఫిర్యాదుచేశారు. ఎస్పీ నాయుడుపేట పోలీసులను విచారించి చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు పంపారు. అయితే వారు స్పందించకపోవడంతో బాధితులు నాయుడుపేట ఎస్సై పీవీ నారాయణను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. సర్టిఫికెట్లు ఎవరికి ఇచ్చిందో వారినే అడగాలి. ఆవుల బసవరెడ్డి ఏబీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్, కనిగిరి, ప్రకాశం జిల్లా విద్యార్థిని సర్టిఫికెట్లు ఎవరికిచ్చిందో వారినే అడగాలి. పాస్వర్డ్ ఎవరు ట్యాంపింగ్ చేశారో మాకు తెలియదు. ఎవరు చేశారో వారినే అడిగితే తెలుస్తుంది. సర్టిఫికెట్లు కళాశాలలో సంబంధిత విభాగంలో ఉంటాయి. వాటి విషయం చైర్మన్, ప్రిన్సిపల్‌ను అడిగితే ఎలా? -
రక్షణ చట్టం ఏర్పాటుచేయాలి
రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు నాయుడుపేట : రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుచేయాలని రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య కోరారు. నాయుడుపేటలోని గరిడివీధిలో ఆదివారం సంఘం 5వ జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకువచ్చిన అట్రాసిటీ చట్టం మాదిరిగానే రజకుల కోసం చట్టం తేవాలన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై 70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదన్నారు. సంఘం నాయకులు పసుపులేటి రమేష్, జానకిరామ్, జే సుబ్రమణ్యం, మాధవయ్య, మధు, కలత్తూరు రమణయ్య, జే హుస్సేన్, మనోరమ్మ, చందన పాల్గొన్నారు. -
రూ.330 కోట్లతో హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్
ట్రాన్స్‌కో సూపరిండెంట్ ఇంజనీర్ కళాధర్‌రావు నాయుడుపేట : జిల్లాలో రూ.330 కోట్లతో హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌కు ప్రణాళికను సిద్ధం చేసినట్లు విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ కళాధర్‌రావు అన్నారు. నాయుడుపేట విద్యుత్‌శాఖ సబ్ డివిజినల్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రూ.100 కోట్లుతో రూరల్, అర్బన్ డివిజన్లలో పనులు ప్రారంభించామన్నారు. పెద్ద ట్రాన్స్ఫార్మర్లు స్థానంలో చిన్న ట్రాన్స్ఫ్మార్మర్లు ఏర్పాటుచేయడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. దీంతో విద్యుత్ చౌర్యానికి అవకాశం లేకుండాపోతుందని చెప్పారు. జవాబుదారీతనం పెంచేందుకు అధికారి స్థాయి నుంచి ఈ సంవత్సరం నుంచి జూనియర్ లైన్‌మన్ వరకు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో నాయుడుపేట సబ్ డివిజన్ డీఈ శ్రీనివాసులు, ఏడీఈ ప్రభాకర్, ఏఈలు నాగరాజు, చిన్నయ్య పాల్గొన్నారు. -
స్నేహితుడిని కాపాడబోయి.. మత్యుఒడిలోకి
నాయుడుపేట : ప్రమాదం బారిన పడుతున్న స్నేహితుడిని కాపాడబోయిన ఓ వ్యక్తి తానే మత్యుఒడిలోకి జారుకున్న సంఘటన నాయుడుపేట రైల్వేస్టేషన్ పరిధిలోని విన్నమాల గేట్ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేట మండల పరిధిలోని విన్నమాల పంచాయతీకి చెందిన దార్ల గిరి (27) తన స్నేహితులతో కలిసి పట్టణంలోనికి వచ్చేందుకు రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. అంతలోనే రైలు అతివేగంగా వస్తుండటంతో ఉలికిపడ్డ స్నేహితులు కొంతమంది ముందుకు పరుగులు తీశారు. మరో స్నేహితుడు రైల్వే ట్రాక్‌పై పడ్డాడు. ఇది గుర్తించిన గిరి అతడి చేయిపట్టుకుని పక్కకు లాగేశాడు. ఈ క్రమంలో గిరి వెళ్లి ట్రాక్పడ్డాడు. అదే సమయంలో రైలు ఢీకొని మత్యువాతపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు రైల్వేస్టేషన్ మాస్టార్‌కు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మతదేహాన్ని అందించారు. మతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇంటిపెద్ద మరణించడంతో వారంతా వీధినపడ్డారు. స్నేహితుడిని కాపాడబోయి గిరి దుర్మరణం చెందడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నాయుడుపేట : పట్టణంలో ఆర్టీసి బస్టాండ్ వద్ద ఉన్న ఓ లాడ్జిలో సాప్ట్వేర్ ఉద్యోగి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బుజబుజనెల్లూరుకు చెందిన దూర్జటి భరద్వాజ (30) చెన్నైలోని ఓ స్టాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 24 సాయంత్రం భరద్వాజ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. బుధవారం ఉదయం రూమ్ నంబర్ 211లో ఉంటున్న భరద్వాజ తలుపునకు గడియపెట్టి ఉండడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి తెలియపరిచారు. తలుపు తీసే ప్రయత్నం చేసిన వీలు కాకపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పీవీ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని లాడ్జి యజమాని వద్ద ఉన్న మరో తాళం చెవితో గది తలుపులు తెరిచారు. బెడ్‌పై భరద్వాజ లేకపోవడంతో బాత్రూంలో పరిశీలించారు. బాత్రూం గదిలో బేషిన్పై వెలికిలా పడి ఉండడాన్ని గుర్తించారు. మృతుడు భరద్వాజ దగ్గర ఉన్న ఐడీ కార్డులను పోలీసులు పరిశీలించారు. బుజబుజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం అందించారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాయుడుపేటలో భారీ వర్షం
నాయుడుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాయుడుపేట ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండతీవ్రంగా ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రధానంగా తిమ్మాజీకండ్రిగ, చిగురుపాడు, మేనకూరు, కోనేటిరాజుపాళెం, భీమవరం, యర్రప్పశెట్టికండ్రిగలో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో పొలాల్లో నీళ్లు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరితడికి నీరందక బోర్లు నుంచి వచ్చే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్న నేప«థ్యంలో భారీ వర్షం వరిపంటకు ఊపిరి పోసిందని సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు యర్రప్పశెట్టికండ్రిగ, మేనకూరు తదితర గ్రామాల వీధుల్లో నీరు నిలిచి చిత్తడి చిత్తడిగా మారాయి. -
లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు
నాయుడుపేట టౌన్: పట్టణ పరిధిలోని శ్రీ కాళహస్తి బైపాస్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఇనుప పైపుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, క్లీనర్ ఖాదర్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి భారీ ఇనుప పైపుల లోడుతో లారీ కష్ణపట్నం పోర్టుకు బయలుదేరింది. మార్గమధ్యలో నాయుడుపేట వద్ద అవని అపార్ట్మెంట్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ బోల్తా పడింది. గాయపడిన రాజు, ఖాదర్బాషాకు మొదట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మరోవైపు ఇనుప పైపులు తగిలి ఓ విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో అదుపు తప్పి ఢీకొట్టడంతో..
నాయుడుపేట(నెల్లూరు జిల్లా): నాయుడు పేట మండలం ఎంపీ చక్కెర కర్మాగారం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆటో అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాయుడు పేట నుంచి అపెక్స్ అనే దర్జీ పరిశ్రమకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
నాయుడుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నాయుడుపేట మండలం శ్రీనివాసపురంలో మంగళవారం చోటుచేసుకుంది. మర్లపల్లి గ్రామానికి చెందిన గీత(17) అనే విద్యార్థిని శ్రీనివాసపురం రైల్వేట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఆమెను ఎందుకు మందలించారనే విషయం తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు రాకముందే తల్లిదండ్రులు యువతి మృతదేహాన్ని సంఘటనాస్థలం నుంచి తీసుకువెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విదేశీయులకు గాయాలు
నాయుడుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) : నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్తులు గాయపడ్డారు. దక్షిణాఫ్రికాకు చెందిన అడ్వెంచర్స్ చారిటీస్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కొందరు మన దేశంలో పర్యటిస్తున్నారు. మేఘాలయ నుంచి ప్రారంభమైన వారి పర్యటన కోచి వరకు సాగనుంది. ఈ క్రమంలో వారు ఆటోల్లో కోచి వైపు వెళ్తుండగా నాయుడుపేట సమీపంలోని ఇనుమాముల గ్రామం వద్ద జాతీయరహదారిపై వీరి ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని వైద్యుల సూచన మేరకు చెన్నైకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాయుడుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పరారైన ఇద్దరు నైజీరియన్లు అరెస్టు
నాయుడుపేట: గంజాయి అక్రమ రవాణా చేస్తూ దొరికినట్టే దొరికి పరారైన ఇద్దరు నైజీరియన్లు ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. టోరీ ముస్తబా, విక్టర్ డిజోబీ అనే ఇద్దరు నైజీరియన్లు, తమిళనాడుకు చెందిన మురుగన్ అనే వ్యక్తితో కలిసి గంజాయిని చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ నెల 7న దొరవారిసత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు స్టేషన్ నుంచి పరారయ్యారు. దీంతో గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందం తమిళనాడులోని ఈ రోడ్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇద్దరు నైజీరియన్ల వీసా కాలం 2012లోనే ముగిసిందని, అయినా అక్రమంగా దేశంలోనే ఉంటూ విశాఖ నుంచి చెన్నైకు గంజాయి రవాణా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
ప్రైవేట్ బస్సులో 6కిలోల బంగారం చోరీ
నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ దొంగతనం జరిగింది. చెన్నైకి చెందిన ఓ బంగారు ఆభరణాల సంస్థలో పనిచేస్తున్న సెంథిల్, మహేందర్ అనే వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 14 కిలోల బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు వచ్చారు. పని ముగించుకుని కొంత బంగారం తీసుకుని వారు బుధవారం రాత్రి కేశినేని ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలు దేరారు. గురువారం ఉదయం ఆ బస్సు నెల్లూరు జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో టిఫన్ కోసం బస్సు ఆగింది. అనంతరం తిరిగి బస్సు బయలుదేరుతుండగా సెంథిల్, మహేందర్ తమ బ్యాగ్ ఒకటి కనిపించటం లేదని బస్సు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన బ్యాగులో ఆరు కిలోల బంగారు ఆభరణాలున్నాయని సెంథిల్, మహేందర్ చెబుతున్నారు. సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి ఒక వ్యక్తి హడావిడిగా ఓ బ్యాగుతో బస్సు దిగి, కారులో వెళ్లిపోయాడని బస్సు క్లీనర్ పోలీసులకు తెలిపాడు. బస్సులోని ప్రయాణికుల వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. -
ఎంపీ మేకపాటికి ఘనస్వాగతం
నాయుడుపేట టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయుడుపేటలో శనివారం ఘనస్వాగతం లభించింది. పార్లమెంట్ సమావేశాల అనంతరం మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు స్థానిక గోమతి సెంటర్లో స్వాగతం పలికారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు సత్కరించారు. రాజమోహన్‌రెడ్డి వెంట ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్‌ను కూడా అభినందించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, అవి పరిష్కారమయ్యేందుకు పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మండల పరిధిలోని ఎన్నికల ఫలితాలపై నాయకులతో కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు సుందరరామిరెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, పోతిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నవీన్‌కుమార్‌నాయుడు, అన్నమనేని రామకృష్ణ, పాదర్తి హరనాథ్‌రెడ్డి, అత్తలపాళెం మధురెడ్డి, పేట చంద్రారెడ్డి, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గంధవల్లి సిద్ధయ్య, మైలారి నాగరాజు, జేష్టాది అంజనీ, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, ఆబోతుల బాబు, దుప్పల రవీంద్ర, షేక్ షబ్బీర్‌భాషా,జలదంకి రాజగోపాల్‌రెడ్డి,పట్టుకోట రఘు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర కోసం ఆగిన ఉపాధ్యాయుడి గుండె
నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సమైక్యాంధ్ర సాధనలో భాగంగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఉపాధ్యాయుడు భట్టా శంకర్ యాదవ్ (51) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. అంతకు ముందు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పుకూలారు. దాంతో శంకర్ యాదవ్‌ను తోటి ఉపాధ్యాయులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా గత 22వ తేదీ నుంచి జిల్లాలో నిరసన దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జెడ్పీ హైస్కూల్లో సైన్సు టీచర్‌గా పనిచేస్తున్న శంకర్ యాదవ్ ప్రతిరోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు కూడా ఆయన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయలు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శంకర్ యాదవ్ కూడా నినాదాలు చేస్తూ కుప్పకూలిపోయారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా శంకర్ యాదవ్ మృతి పట్ల సమైక్యవాదులు సంతాపం తెలిపారు.