ఇంజనీరిగ్ సీటు ఇప్పిస్తానని మోసం
ఇంజనీరిగ్ సీటు ఇప్పిస్తానని మోసం
Published Tue, Aug 30 2016 11:34 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
నాయుడుపేట : ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానని చెప్పి కళాశాలకు చెందిన దళారి మోసం చేసిన సంఘటన నాయుడుపేటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మమ్మ కుమార్తె బందిల మణెమ్మ డక్కిలి గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షలో 99,731 ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులను శరవణన్ అనే యువకుడు కలిసి ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా సీటు, వసతి సదుపాయం కల్పిస్తామని వారిని నమ్మబలికాడు. దీంతో వారు మణెమ్మ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణపత్రాలతో పాటు అర్హత పొందిన జాబితాను అతడికిచ్చారు. మణెమ్మ మొదటి, మూడో కౌన్సెలింగ్‌లకు హాజరై ఆదిశంకర విద్యాసంస్థలో సీటు కావాలని దరఖాస్తు చేసుకుంది. అయితే శరవణన్ ఆప్షన్ పెట్టేందుకు ఇచ్చే పాస్‌వర్డ్ తెలుసుకుని ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఏబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలను రెండో ఆప్షన్‌గా పెట్టాడు. అధికారులు ఏబీఆర్‌లో సీటు ఇస్తామని చెప్పారు. అందులో చేరడం ఇష్టంలేని మణెమ్మ తల్లిదండ్రులు శరవణన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. అతను ఏబీఆర్ కాలేజీలో ఉన్నాయి. అక్కడికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో వారు మోసపోయామని గ్రహించారు. కళాశాల యాజమాన్యాన్ని కలిసి తమ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. వారు రూ.30 వేలు ఇస్తే సర్టిఫికట్లు ఇస్తామని చెప్పడంతో బాధితులు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీకి ఈ నెల 22వ తేదీన గ్రీవెన్‌సెల్‌లో ఫిర్యాదుచేశారు. ఎస్పీ నాయుడుపేట పోలీసులను విచారించి చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు పంపారు. అయితే వారు స్పందించకపోవడంతో బాధితులు నాయుడుపేట ఎస్సై పీవీ నారాయణను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు.
సర్టిఫికెట్లు ఎవరికి ఇచ్చిందో వారినే అడగాలి. ఆవుల బసవరెడ్డి ఏబీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్, కనిగిరి, ప్రకాశం జిల్లా
విద్యార్థిని సర్టిఫికెట్లు ఎవరికిచ్చిందో వారినే అడగాలి. పాస్‌వర్డ్ ఎవరు ట్యాంపింగ్ చేశారో మాకు తెలియదు. ఎవరు చేశారో వారినే అడిగితే తెలుస్తుంది. సర్టిఫికెట్లు కళాశాలలో సంబంధిత విభాగంలో ఉంటాయి. వాటి విషయం చైర్మన్, ప్రిన్సిపల్‌ను అడిగితే ఎలా?
Advertisement
Advertisement