నాయుడుపేట: గంజాయి అక్రమ రవాణా చేస్తూ దొరికినట్టే దొరికి పరారైన ఇద్దరు నైజీరియన్లు ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. టోరీ ముస్తబా, విక్టర్ డిజోబీ అనే ఇద్దరు నైజీరియన్లు, తమిళనాడుకు చెందిన మురుగన్ అనే వ్యక్తితో కలిసి గంజాయిని చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ నెల 7న దొరవారిసత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు స్టేషన్ నుంచి పరారయ్యారు.
దీంతో గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందం తమిళనాడులోని ఈ రోడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇద్దరు నైజీరియన్ల వీసా కాలం 2012లోనే ముగిసిందని, అయినా అక్రమంగా దేశంలోనే ఉంటూ విశాఖ నుంచి చెన్నైకు గంజాయి రవాణా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.