శంకర్ యాదవ్, ఫొటో: రమణ, నాయుడు పేట
నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సమైక్యాంధ్ర సాధనలో భాగంగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఉపాధ్యాయుడు భట్టా శంకర్ యాదవ్ (51) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. అంతకు ముందు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పుకూలారు. దాంతో శంకర్ యాదవ్ను తోటి ఉపాధ్యాయులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
సమైక్యాంధ్రకు మద్దతుగా గత 22వ తేదీ నుంచి జిల్లాలో నిరసన దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జెడ్పీ హైస్కూల్లో సైన్సు టీచర్గా పనిచేస్తున్న శంకర్ యాదవ్ ప్రతిరోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు కూడా ఆయన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయలు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శంకర్ యాదవ్ కూడా నినాదాలు చేస్తూ కుప్పకూలిపోయారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా శంకర్ యాదవ్ మృతి పట్ల సమైక్యవాదులు సంతాపం తెలిపారు.