మాలయకోటలో పేలిన తూటాలు
నాయుడుపేట : పట్టణ శివారు ప్రాంతం మాలయకోట (మునిరత్నంనగర్)లో సోమవారం సాయంత్రం పెద్ద శబ్దంతో రెండు తూటాలు పేలాయి. పేలుడు శబ్ధానికి ఇళ్లలో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. నడిబజారులో జరిగిన ఈ ఘటనలో ఓ వీధి కుక్క నోటి వద్ద గాయపడి ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణనష్టం జరిగిందోనని, ఎవరికి ఏమైందోనని ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. స్థానికుల సమాచారం మేరకు.. మాలయకోటలో సాయంత్రం 5 గంటల సమయంలో ఓ కుక్క అక్కడ పడి ఉన్న ప్లాస్లిక్ సంచిలో పేగులను తినే క్రమంలో పెద్ద శబ్దంతో తూటా పేలింది. దీంతో కుక్క రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే మరో తూటా పడి ఉండటంతో స్థానికులు అది కూడా పేలుతుందని భావించి నిర్వీర్యం చేసేందుకు నీళ్లల్లో వేసేందుకు తీసుకెళ్లారు. అయితే మళ్లీ దూరంగా పెట్టి దానిపై ఇటుక రాయి విసిరారు. దీంతో అది కూడా పేలి, దాని ధాటికి ఇటుక రాయి ముక్కలుముక్కలైంది.