జ్వరంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు చలికి తట్టుకునేందుకు తాను నిద్రిస్తున్న పట్టి మంచం కింద నిప్పుల కుంపటి పెట్టమని భార్య పెట్టింది కు చెప్పాడు. భర్త చెప్పిందే తడవుగా ఆ భార్య చలి పులి నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుందని భావించి కుంపటి పెట్టింది. అయితే ఆ కుంపటే అతన్ని సజీవ దహనం చేసింది. ఈ విషాద సంఘటన వివరాల్లోకి వెళ్తే...
మెరకముడిదాం: మండలంలోని గోపన్నవలస గ్రామంలో రజక కులానికి చెందిన గురాన పైడియ్య( 65) అనే వృద్ధుడు, అతని భార్య అప్పమ్మలు కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. గురాన పైడియ్యకు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రత ఎక్కువగా వుండడంతో మంచం కూడా దిగలేని పరిస్థితిలో పైడియ్య పడుకున్నాడు. తనకు ఎక్కువగా చలి వేస్తుందని తన మంచం కింద బొగ్గుల కుంపటి పెడితే చలి తగ్గుతుందని తన భార్య అప్పమ్మను పైడియ్య కోరాడు. దీంతో అప్పమ్మ వెంటనే బొగ్గుల కుంపటిని రాజేసి పైడియ్య మంచం కింద పెట్టింది. ఎప్పటిలాగే తను కూలీ పనికి వెళ్లింది. తిరిగి అప్పమ్మ వచ్చేసరికి పైడియ్య కాలిన గాయాలతో కింద పడి వున్నాడు.
దీనిని గమనించిన అప్పమ్మ లబోదిబోమని ఏడుస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా పరుగున వచ్చారు. అప్పటికే పైడియ్య కుంపటి రాజుకొని మంటలు కాస్తా మంచానికి అంటుకొని సజీవ దహనమయ్యాడు. పైడియ్యకు జ్వరం తీవ్రత ఎక్కువగా వుండడంతో లేవలేని పరిస్థితిలో వుండడంతో అతను సజీవ దహనమయ్యాడు. పైడియ్యకు భార్య అప్పమ్మతో పాటూ ముగ్గురు కొడుకులు వున్నారు. వీరంతా రెక్కాడితేనేగాని కడుపు నిండని పరిస్థితిలో వున్నారు. విషయం తెలుసుకున్న బుదరాయవలస ఎస్‌ఐ పి.నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడు భార్య అప్పమ్మ, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment