సాక్షి ప్రతినిధి, గుంటూరు
అమరావతి టౌన్‌షిప్‌లోని స్థలాల కేటాయింపు వ్యవహారం ఆ సంస్థ ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోనున్నది. వీజీటీఎం ఉడా ఉద్యోగులకు స్థలాల కేటాయింపులో వైస్ చైర్మన్లు వివక్షతో వ్యవహరించారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి సంస్థకు నష్టం కలిగించారు. ఉడా కార్యదర్శి, ఫారెస్టు ఆఫీసరు, ఓఎస్‌డి వంటి బాధ్యతలు నిర్వహించడానికి రెవెన్యూ, ట్రెజరీ, పంచాయతీరాజ్‌శాఖల నుంచి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు పని చేసిన సంవత్సర కాలంలోనే కనీసం రూ.70 లక్షల విలువైన (ప్రస్తుత మార్కెట్ రేటు) స్థలాన్ని రూ.1.75 లక్షలకే తన్నుకుపోయారు. దాదాపు 10 మంది అధికారులకు ఈ స్థలాలను అప్పటి వైస్ చైర్మన్లు పప్పుబెల్లంలా పంచి పెట్టారు. వీటి విలువ అక్షరాల రూ.7 కోట్లు. ఇదిలావుంటే తమ సర్వీసు అంతా ఉడాలోనే గడిపిన ఉద్యోగులకు మాత్రం 200 నుంచి 300 చదరపు గజాల స్థలాన్ని కేటాయించి వైస్ చైర్మన్లు వివక్ష చూపారు.దాదాపు 20 సంవత్సరాల క్రితం మంగళగిరికి సమీపంలో అమరావతి టౌన్‌షిప్‌ను ఉడా ప్రకటించి స్థలాల అమ్మకాలను ప్రారంభించింది. 500 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసి 300 ఎకరాల్లో టౌన్‌షిప్‌ను వేసింది. వీటిలో అమ్మగా మిగిలిన స్థలాలను ఉడా ఉద్యోగులు, డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు అప్పటి ప్రభుత్వ రేటు చెల్లించి కైవసం చేసుకుంటున్నారు. డెప్యుటేషన్‌పై వచ్చిన ఒకో అధికారికి వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయింపు జరిగింది.
టౌన్‌షిప్ ప్రకటించినప్పుడు చదరపు గజం రూ.500 లకు ఉడా అమ్మకాలు జరిపింది. అయితే ఉడా ఉద్యోగులకు మాత్రం చదరపు గజం రూ.175లకు విక్రయించింది. ప్రస్తుతం అమరావతి టౌన్‌షిప్‌లో చదరపు గజం మార్కెట్ ధర రూ.7 వేలు పలుకుతుంటే ఉడా ఉద్యోగులకు మాత్రం రూ.175లకు విక్రయించింది. కొంతమంది అధికారులు ఉడాలో సంవత్సరం కూడా పనిచేయకుండా రూ.70 లక్షల విలువైన స్థలాన్ని రూ.1.75 లక్షలకే పొందారు. అనూహ్యంగా అందివస్తోన్న ఈ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు అధికారులు ఉడాలోని ముఖ్య పోస్టుల కు డెప్యుటేషన్‌పై రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. రూ.2 నుంచి 5 లక్షల్లోపు రాజధాని స్థాయిలోని ఉన్నతాధికారులు, లేదా రాజకీయ నాయకులకు ఖర్చుచేసి ఆ పోస్టులు పొంది సంవత్సరంలోపే అమరావతి టౌన్‌షిప్‌లోని స్థలాన్ని జాక్‌పాట్‌లా కొట్టేశారు.
అక్రమ కేటాయింపులపై చర్చ.. గురువారం విజయవాడలో జరిగిన ఉడా పాలకవర్గ సమావేశంలో ఈ అక్రమ కేటాయింపులపై చర్చ సాగింది. వైస్ చైర్మన్లకు ఈ స్థలాల కేటాయింపుపై అసాధారణ అధికారాలు ఉన్నాయా ఉంటే వారి వివరాలు చూపాలని కొందరు ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసులో ఒకసారే ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలనే నిబంధన ఉంటే, డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులంతా ఇతర ప్రాంతాల్లో స్థలాలు తీసుకోలేదా వంటి వివరాలను తెలపాలని సభ్యులు కోరారు. ఉడా సిబ్బందితోపాటు వైస్ చైర్మన్ వీటి వివరాలు అందుబాటులో లేవని స్పష్టం చేయడంతో తర్వాతి సమావేశానికి వీటిని పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. కేటాయింపుల్లో అక్రమాలు ఉంటే ప్రభుత్వానికి నివేదిక పంపుతానని చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి ఆ సమావేశంలో ప్రకటించారు. ఇందులో అక్రమాలు ఉంటే అప్పటి వైస్ చైర్మన్‌లపై ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉందన్నారు.
అమరావతి టౌన్‌షిప్‌లో అక్రమాలు రూ. 7 కోట్లకు శఠగోపం
Published Sat, Nov 9 2013 1:43 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement