రాజమండ్రి: ఈ నెల 16వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బోటు బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంది. ఈ బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగివచ్చారు. వీరంతా తొండంగి మండలం పాతపెరుమాళ్లపురానికి చెందిన మత్య్సకారులు. మరోవైపు కాకినాడ దుమ్మలపేటకు చెందిన మత్స్యకారులు ఇప్పటికీ విశాఖతీరంలో లంగరు వేసిన ఓ ప్రైవేటు నౌకలోనే ఉన్నారు. ఇంజన్ చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకున్న వీరిని ఈ నెల 22న ఓ ప్రైవేట్ మర్చంట్ నౌక రక్షించింది.
23న ఈ నౌక విశాఖ తీరానికి చేరుకున్నా..పోర్టులోకి అనుమతి లేకపోవటంతో తీరంలోనే లంగరు వేసింది. ఐతే ఈ నౌకలో ఉన్న ఏడుగురు మత్స్యకారులను కాకినాడ తీసుకువచ్చేందుకు అధికారులు చొరవచూపించడం లేదు. నౌక పోర్టులోకి వచ్చిన తర్వాతే కాకినాడకు తీసుకు వస్తామని మత్స్యకారులకు అధికారులు సూచిస్తున్నారు.