చదలాడ.. వ్యధవాడ | 7-year-old Missing Girl Found Dead in AP | Sakshi
Sakshi News home page

చదలాడ.. వ్యధవాడ

Published Sat, Feb 20 2016 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 5:34 PM

పూజిత మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు (అంతరచిత్రం) పూజిత - Sakshi

పూజిత మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు (అంతరచిత్రం) పూజిత

చాక్లెట్ కొనుక్కుంటానని చెంగుచెంగున గెంతుతూ వీధిలోకి వెళ్లిన చిన్నారి.. శవమై కాలువలో కనిపించడం అయినవారినే కాదు.. ఆ ఊరినే కలచివేసింది. అందరి కనులనూ చెమ్మగిల్లజేసింది. బరువెక్కిన వారి హృదయూలను ‘ఈ విషాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది?’ అన్న ప్రశ్నలు పీడిస్తున్నాయి. పెద్దాపురం మండలంలోని చదలాడలో బుధవారం అదృశ్యమైన దొడ్డిపట్ల పూజిత (7) శుక్రవారం ఏలేరు కాలువలో మృతదేహమై కనిపించడంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది.
 
* ఆ గ్రామంలో బుధవారం అదృశ్యమైన ఏడేళ్ల పూజిత
* రెండురోజుల తర్వాత ఏలేరు కాలువలో కనిపించిన మృతదేహం
* పాప మృతిపై వ్యక్తమవుతున్న పలు అనుమానాలు

 
పెద్దాపురం (సామర్లకోట) : కిర్లంపూడి మండలం వీరవరానికి చెందిన దొడ్డిపట్ల నారాయణరావు ఆ మండల తహశీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి బావమరిది సతీష్ వివాహం జరగనుండడంతో భార్య విజయకుమారిని, కుమార్తె పూజితను ఆరోజు ఉదయం చదలాడలోని మామ వరుపుల రూపులయ్య ఇంటి వద్ద దింపి వెళ్లారు.

ఇంట్లో పెద్దలు పెళ్లి హడావుడిలో ఉండగా.. ఆడుకుంటున్న పూజిత చాక్లెట్ కొనుక్కుంటానని తాతకు చెప్పి బయటకు వెళ్లింది. అరుుతే ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పరిసరాల్లో గాలించినా పాప జాడ కానరాలేదు. దాంతో తాత రూపులయ్య పెద్దాపురం పోలీసు స్టేషన్‌లో, తండ్రి నారాయణరావు కిర్లంపూడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. బుధవారం రాత్రి జరగాల్సిన వివాహాన్ని పాప అదృశ్యం కారణంగా వాయిదా వేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన పూజితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారనే అనుమానాలు వ్యక్తం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు బాలిక కోసం విస్త­ృతంగా గాలించారు.
 
ఎలా జరిగిందో ఈ ఘోరం..
కాగా శుక్రవారం తాటిపర్తి సమీపంలోని ఏలేరు కాలువఒడ్డున బాలిక మృతదేహాన్ని చూసిన ఆ గ్రామస్తులు రూపులయ్య బంధువులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని ఆ మృతదేహం పూజితదే కావడంతో హతాశులయ్యూరు. పాప ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో పడిపోయి రెండు కిలోమీటర్ల దూరంలోని తాటిపర్తి వద్దకు కొట్టుకు వచ్చిందా లేక ఎవరైనా చంపి వేసి కాలువలో పారేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు, తాత తమకు ఎవరూ శత్రువులు లేరని చెపుతున్నారు. ఆ ఇంట జరగాల్సిన వివాహాన్ని నిలిపివేయడానికే ఎవరో పూజితను కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానమూ రేకెత్తింది.

అయితే ఇరువైపులా అంగీకారంతోనే వివాహం నిశ్చయమైందని బంధువులు అంటున్నారు. జగ్గంపేట సీఐ జీవీవీ సత్యనారాయణ, పెద్దాపురం ఎస్సై వై.సతీష్ సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహానికి పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా అటు పూజిత విషాదాంతంతో అటు వీరవరంలోనూ దుఃఖపూరిత వాతావరణం అలముకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement