టెక్కలి రూరల్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావాన్ని జిల్లాలో సమర్ధంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్తి నష్టాలను పక్కన పెడితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. తుపాను ప్రభావిత తీర గ్రామాలకు చెందిన సుమారు 74 వేల మత్స్యకార కుటుంబాలను నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తుపాన్ నష్టాలను పారదర్శకంగా అంచనా వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 2014 ఎన్నికల వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు బాలరా జు, గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు.
నష్టపరిహారం అందిస్తాం..
సోంపేట(కంచిలి): తుపాను వల్ల నష్టపోయినవారికి పరిహారం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం హామీ ఇచ్చింది. తుపాను బాధిత గ్రామాలైన బారువ కొత్తూరు, వాడపాలెం, కవిటి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మంత్రుల బృందం పర్యటించింది. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. బోట్లు, వలలు సముద్రంలో కొట్టుకుపోవటం, చిరిగిపోవటంతో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల్లో నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు వాపోయారు. కంటి తుడుపు చర్యగా వచ్చి పరామర్శించి వెళ్లిపోవటం సరికాదని కొందరు మహిళలు మంత్రుల్ని నిలదీశారు. ప్రభుత్వ స్పందన బాగోలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇంతటి నష్టం జరగటం బాధాకరమేనని, తొందర్లో సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్, గంటా శ్రీనివాస్, బాలరాజు పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్.దాస్ తదితరులు పాల్గొన్నారు.
74 వేల మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు
Published Mon, Oct 14 2013 3:20 AM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM
Advertisement