చీపురుపల్లిలో 75 షాపులకు.. కరెంట్ కట్ ?
Published Fri, Dec 13 2013 3:07 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
చీపురుపల్లి,న్యూస్‌లైన్: చీపురుపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని నిర్మించిన దుకాణాలను హైకోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు తొలగించనున్నారు. ఇంతవరకు రాజకీయ ఒత్తిళ్లే కాకుండా మానవతా దృక్పథంతో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు చివరికి వారి ఉద్యోగాలకే ప్రమాదం ముంచుకురానుండడంతో చేసేదేమీ లేక హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసే విధంగా చర్యలు ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు దుకాణాల తొలగింపునకు విద్యుత్ కనెక్షన్లు అడ్డంగా ఉన్నాయని, అసలు ఆక్రమిత స్థలాల్లో దుకాణాలు నిర్మించిన వారికి విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారంటూ తహశీల్దార్ టి.రామకృష్ణ, చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం(ఆర్‌ఈసీఎస్) ఎం.డిని లిఖిత పూర్వకంగా కోరారు. దీనికి స్పందించిన ఆర్‌ఈసీఎస్ అధికారులు తమకెందుకు వచ్చిన బాధ అనుకుంటూ చర్యలు ప్రారంభించారు.
అందులో భాగంగానే విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని ఇటీవల నిర్మాణం చేపట్టిన 75 దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేశారు. ఇక మిగిలిందల్లా దుకాణాలు తొలగించడమేనంటూ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని చిరువ్యాపారులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయం నిర్మాణాన్ని చేపట్టారంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇజ్జరోతు రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)న్ని గతంలో వేశారు. దీనికి స్పందించిన హైకోర్టు..రెవెన్యూ అధికారులకు అక్షింతలు వేసి, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత కట్టడాలను తక్షణమే తొలగించాలంటూ దాదాపు రెండు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమం, అదీ, ఇదీ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివ రకు హైకోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ ఉల్లంఘన కింద మరోసారి కోర్టుకు ఎవరైనా వెళ్తే కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పేటట్లు లేదు.
దీంతో ఏం చేయాలో తెలియని యంత్రాంగం దుకాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేసింది. ఆర్‌ఈసీఎస్ అధికారులు విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం పూర్తయి ఆ నివేదికను రెవెన్యూ అధికారులకు అందజేస్తే, ఆపై దుకాణాల తొలగింపేనంటూ అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే విషయమై ఆర్‌ఈసీఎస్ ఏఈ ఆర్.శ్రీనివాసపట్నాయక్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దుకాణాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తున్నామని తెలిపారు. తహశీల్దార్ టి.రామకృష్ణ ఇదే విషయమై మాట్లాడుతూ చట్టపరమైన చర్యలు చేపట్టక తప్పదన్నారు. ప్రభుత్వ స్థలంలో దుకాణాల నిర్మాణం చేపట్టిన వారికి ఏ రకమైన ఆధారాలూ లేవని, హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించామన్నారు.
Advertisement
Advertisement