ఓటెత్తిన నంద్యాల | 79.20 per cent polling in the Nandyal by-election | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన నంద్యాల

Published Thu, Aug 24 2017 1:50 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

ఓటెత్తిన నంద్యాల - Sakshi

ఓటెత్తిన నంద్యాల

ఉప ఎన్నికలో 79.20 శాతం పోలింగ్‌ 
- గోస్పాడు మండలంలో అత్యధికంగా 90.81 శాతం నమోదు
దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్‌గా రికార్డు
ఉదయం నుంచే బారులుతీరిన ప్రజానీకం 
ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళలే అధికం
అధికార పార్టీ ఎమ్మెల్యేల హల్‌చల్‌.. చివరి 3 గంటలూ దౌర్జన్యం 
రిలీవర్‌ ఏజెంట్లను లోపలికి అనుమతించని వైనం
ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు
 
నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ బుధవారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ప్రధానంగా మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి నంద్యాల చరిత్రలో లేని విధంగా 79.20 శాతం ఓటింగ్‌ నమోదైంది. వైఎస్‌ఆర్‌ సీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరాక గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇందులో భాగంగా బుధవారం పోలింగ్‌ ప్రారంభం కాగానే ఓటింగ్‌ శాతం భారీగా పెరుగుతుండటంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు భయోత్పాతం సృష్టించేందుకు తీవ్రంగా యత్నించారు. ఉదయం నుంచి అత్యంత ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్‌.. చివరి మూడు గంటల్లో రౌడీ రాజ్యాన్ని తలపించింది. 7వ వార్డులో కౌన్సిలర్‌ కలాంపై టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారు. భూమా మౌనిక, జగత్‌విఖ్యాత్‌రెడ్డిలు భారీగా అనుచరులను వెంటేసుకుని పట్టణంలో హల్‌చల్‌ చేయడం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గాంధీనగర్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్‌ రాజగోపాల్‌రెడ్డిపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే రాంబాబు అనుచరులు దాడికి విఫలయత్నం చేశారు.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి కాన్వాయ్‌తో పట్టణంలో కలియ తిరుగుతూ ఇబ్బంది కలిగిస్తున్నా పోలీసులు అభ్యంతరం చెప్పలేకపోయారు. మంత్రి అఖిలప్రియ అళ్లగడ్డకు చెందిన వ్యక్తులను వెంటబెట్టు కొని పలు పోలింగ్‌ బూత్‌లలో కలియతి రిగారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులపై దూషణలకు దిగారు. అయినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సంయమనం పాటించి, పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాయి. కాగా, గెలుపు తమదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
 
బారులు తీరిన మహిళలు
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటలకు 17 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌లో అదే పరంపర కొనసాగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 53 శాతం, సాయంత్రం 5 గంటలకు 77.6 శాతం ఓటింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి 79.20 శాతం నమోదైంది. గోస్పాడు మండలంలో అత్యధికంగా 90.81 శాతం, నంద్యాల రూరల్‌లో 87.61 శాతం ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. ముస్లిం మైనార్టీ మహిళలు ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఎవరికి ఓటు వేశారంటూ వివిధ న్యూస్‌ చానళ్లు, పత్రికలు (సాక్షి కాదు) పలు విధాలా ప్రయత్నించినా ఓటు సీక్రెట్‌ అంటూ బహిర్గత పరచక పోవడం విశేషం. అత్యధికంగా ఓటింగ్‌ శాతం నమోదు కావడంతో ఇది ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తోందని అధికార పార్టీ నేతలు నిరాశలో ఉండిపోయారు. 
 
టీడీపీ ఎమ్మెల్యేల హల్‌చల్‌
నియోజకవర్గానికి చెందిన ప్రజలు తప్ప ఇతరులెవరూ నంద్యాల నియోజవర్గ పరిధిలో ఉండకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినప్పటికీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు లెక్క చేయలేదు. పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి హల్‌చల్‌ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల పాస్‌ లేకుండా కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లు, ఏజెంట్లను ప్రభావితం చేస్తున్నా అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని అందరూ చర్చించుకుంటున్న సమయంలో తమకు ఓట్లు పడటం లేదని అధికార పార్టీ నాయకులు అనుమానించారు. మరో మూడు గంటల్లో పోలింగ్‌ గడువు ముగుస్తుందనగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను ప్రలోభపెట్టారు.

ఏజెంట్లను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌ నగర్‌లో కౌన్సిలర్‌ శివశంకర్‌ ఓటర్లకు మరోమారు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు పోలింగ్‌ బూత్‌ల సమీపంలో టీడీపీకి ఓటు వేస్తామంటే రూ.2 వేలు ఇస్తానంటూ కౌన్సిలర్‌ జేవీసి హారిక బహిరంగంగా ప్రలోభాలకు గురిచేస్తూ హల్‌చల్‌ చేశారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి 7వ వార్డు కౌన్సిలర్‌ కలాంపై దాడి చేయడం, ఎన్జీవో కాలనీలో మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిలు ఏజెంట్లు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్టీఆర్‌ షాదీఖాన సమీపంలో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకోగా.. వారిని ఎమ్మెల్సీ ఫరూక్‌ తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు.  
 
యథేచ్ఛగా దొంగ ఓట్లకు తెగించిన టీడీపీ 
నందమూరినగర్‌లోని పోలింగ్‌ బూత్‌లలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై వివక్ష చూపారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళన నెలకొంది. వైఎస్సార్‌సీపీకి చెందిన రిలీవర్‌ ఏజెంట్లను బయటకు గెంటివేసిన పోలీసులు... తిరిగి వారిని లోపలికి అనుమతించలేదు. నంద్యాల్లోని 18, 18ఏ, 19, 19ఏ, 20, 20ఏ బూత్‌లలో ఉన్న ఏజెంట్లు మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్తామంటే వారి స్థానంలో రిలీవర్‌ ఏజెంట్లు మంజుల, రమాదేవిని అనుమతించలేదు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వారిని తీవ్ర పదజాలంతో దూషించారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. నందమూరి నగర్‌లోని నాలుగు బూత్‌లలో బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు దొంగ ఓట్లు వేశారు.

ఇక్కడికి మొత్తం 60 మందికి పైగా దొంగ ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదు. చివరి క్షణంలో స్పందించిన పోలీసులు.. కేవలం ఆరుగురు దొంగ ఓటర్లను మాత్రమే అరెస్టు చేశారు. నందమూరి నగర్‌ పోలింగ్‌ బూత్‌లో మూడున్నర గంటలపాటు ఈవీఎం మిషన్‌కు అనుబంధంగా ఉండే వీవీ ప్యాట్‌ యంత్రం మొరాయించింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మరమ్మతుకు నోచుకోలేదు. క్యూలో 70 మందికిపైగా ఓటర్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అదనపు వీవీ ప్యాట్‌ యంత్రాన్ని అమర్చడంతో దాదాపు 7 గంటలకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్‌ఆర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ ఎదుట ఓటర్లకు టీడీపీ కౌన్సిలర్‌ శివశంకర్‌ యాదవ్, టీడీపీ నాయకుడు ప్రసాదరెడ్డి డబ్బులు పంచుతుండడంతో స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇటుక పెళ్లతో దాడికి యత్నించారు. కొందరిపై చేయి చేసుకున్నాడు. పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement