8న చంద్రబాబు ప్రమాణం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే నెల 8న ప్రమాణం చేయనున్నారు. ఆదివారం దశమి రోజు శుభప్రదమన్న పండితుల సూచనతో చంద్రబాబు సరేనన్నట్లు సమాచారం. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయవాడ-గుంటూరు మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల0యానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అందుకు ఏర్పాట్లు చేయనున్నారు. గుంటూరు-తాడికొండ మార్గంలో ఉన్న ఈ స్థలాన్ని పార్టీ నేతలు పరిశీలించినా వాహనాల రాకపోకలకు అంత అనుకూలంగా లేదు.
దీంతో జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్నే ఎంపిక చేశారు. మరోవైపు పార్టీ పూజాధికాలను పర్యవేక్షించే ఆచార్య పొన్నలూరి శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్ధనరావుతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయం గురించి చర్చించారు. ఒకవేళ జూన్ 8న వీలుకాని పక్షంలో మర్నాడు 9వ తేదీ కూడా మంచిరోజే కావడంతో అప్పుడైనా ప్రమాణం చేయవచ్చని చర్చించినట్లు తెలిసింది.
విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలి: చంద్రబాబు
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని చంద్రబాబు విజ్ఙప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తాము సానుకూలంగా ఉన్నామన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పరస్పర సహకారం, సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
మహానాడులో ఐదు తీర్మానాలు
టీడీపీ మహానాడులో 5 తీర్మానాలు చేయనున్నట్టు పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు తెలిపారు. స్థానిక ఎన్‌టీఆర్ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయాన్ని తెలుగుజాతి, కార్యకర్తలకు అంకితం చేయడం, అవినీతి రహిత భారత్ నిర్మాణం, పేదరికం లేని సమాజం, ఎన్‌టీఆర్ కలలు, బాబు ఆశయం, సంస్థాగత విషయాలు, టీడీపీ విదేశాంగ విధానంపై తీర్మానాలు చేయనున్నట్టు వివరించారు. మహానాడుకు ప్రతి నియోజకవర్గం నుంచి 60 మంది ప్రతినిధులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మహానాడు 28 సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మహానాడులో తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆరుగురు సాహితీవేత్తలకు పురస్కారాలు అందించనున్నారు.