సాక్షి, సిటీబ్యూరో: వారం క్రితం ఏపీ డీజీపీ కార్యాలయం ఎదురుగా ముంబై వర్తకుల నుంచి తస్కరించిన ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులమంటూ చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
దోపిడీ జరిగింది ఇలా....
ముంబైలోని ఎంవీఎస్ జ్యుయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్‌మన్లు జతిన్ ప్రతాప్‌సిన్ కపాడియా, దేవేంద్ర త్రివేది, హితేష్, సచిన్‌లు బంగారు ఆభరణాలు విక్రయించడానికి ఈనెల 8న హైదరాబాద్‌కు వచ్చారు. లక్డీకపూల్‌లోని ఓ లాడ్జీలో బస చేశారు. వీరు మూడు రోజుల నగరంలో ఉండి, అనంతరం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం రాత్రి లక్డీకపూల్‌లోని హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో జతిన్ ప్రతాప్‌సిన్ కపాడియా నగల బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నిలబడ్డాడు. ముగ్గురు వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి బ్యాగును లాక్కున్నారు. వెంటనే అక్కడే బైక్‌పై ఉన్న వ్యక్తి బ్యాగ్‌తో పారిపోయాడు. ఈ ముగ్గురు కూడా మెల్లగా జారుకున్నారు.
నగల షాపు ఉద్యోగే సూత్రధారి..
ఖైరతాబాద్‌కు చెందిన దాసరి రాహుల్ (22) అబిడ్స్‌లోని సూరజ్‌భాను జ్యుయలరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నగల దుకాణానికి వచ్చిన సేల్స్‌మన్లను పసిగట్టి, అతడి స్నేహితులు జగద్గీరిగుట్టకు చెందిన స్టేట్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కన్వినర్ మహ్మద్ అజహర్ మోహినుద్దీన్ (27), ఘట్‌కేసర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి రాథోడ్ ప్రతాప్ సింగ్ (22), కూకట్‌పల్లికి చెందిన పెయింటర్ కట్ట సాయి కిరణ్ (21), మూసాపేట్‌కు చెందిన షేక్ ఫెరోజ్ (23)లతో కలిసి పథకం రచించాడు. వీరు రెండు ద్విచక్రవాహనాలపై వర్తకుల కదలికలపై మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. ఆదివారం రాత్రి అవకాశం లభించడంతో నగల బ్యాగ్‌ను తస్కరించారు.
పట్టించిన సీసీ కెమెరా..
సైఫాబాద్ ఏసీపీ పి.నారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డిలు ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. బ్యాగ్ లాక్కుని పోతున్న దృశ్యాలు ఘటనాస్థలానికి సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల్లో లభించాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించారు. సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఎ.భాస్కర్, ఏపీ ఆనంద్‌కుమార్ తమ సిబ్బందితో రంగంలోకి దిగి పరారీలో ఉన్న నిందితులను మూడు రోజుల పాటు గాలించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి, సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఏసీపీ పి.నారాయణ పాల్గొన్నారు.
8 కిలోల నగల రికవరీ
Published Sun, Oct 19 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement
Advertisement