ఓయూలో ‘మెస్’ లొల్లి | Student Attack | Sakshi
Sakshi News home page

ఓయూలో ‘మెస్’ లొల్లి

Published Sat, Oct 18 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

ఓయూలో ‘మెస్’ లొల్లి

ఓయూలో ‘మెస్’ లొల్లి

  • విద్యార్థుల దాడి
  •  ఎమ్మెస్సీ ఇంటర్నల్ పరీక్షల బహిష్కరణ
  •  సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ధ్వంసం
  •  ఆత్మహత్యకు యత్నించిన పీహెచ్‌డీ స్కాలర్
  • ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ హాస్టల్ మెస్ బిల్లుల విషయమై తలెత్తిన వివాదం ఆరుగురు పరిశోధన విద్యార్థులపై దాడికి, మరో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. క్యాంపస్ న్యూ పీజీ హాస్టల్ పరిశోధన విద్యార్థులకు కొన్ని నెలలుగా మెస్ బిల్లు అధికంగా వస్తోంది. ఈ విషయమై శుక్రవారం రాత్రి వెంకటేష్, మధు అనే పరిశోధన విద్యార్థుల మధ్య చర్చ జరిగింది. నాన్ బోర్డర్స్ వల్లే బిల్లులు అధికంగా వస్తున్నాయని, వారిని నియంత్రించాలని వెంకటేష్ అనగా.. నియంత్రించడం నీ వల్ల కాదని మధు అన్నాడు.

    ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీన్ని అవమానంగా భావించిన మధు తన స్నేహితులు 20 మందితో కలిసి న్యూ పీజీ హాస్టల్‌లోకి చొరపడి అందులో ఉన్న ఆరుగురు విద్యార్థులను చితక బాదారు. శనివారం ఉదయం న్యూపీజీ పరిశోధన విద్యార్థులు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌ను కలసి జరిగిన విషయాన్ని వివరించారు. దాడికి పాల్పడిన మధు అతడి పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నందున చర్య తీసుకోవాలని కోరారు.

    ప్రిన్సిపాల్ స్పందించక పోవడంతో ఆగ్రహించిన సైన్స్ పీహెచ్‌డీ విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఓయూ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని విద్యార్థులను చెదర గొట్టారు. ఆవేశంతో ఉన్న పరిశోధన విద్యార్థులు జరుగుతున్న ఎమ్మెస్సీ ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలను బహిష్కరించారు. అంతటితో ఆగకుండా నినాదాలు చేస్తూ ఆర్ట్స్ కళాశాల బస్టాప్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు.

    తమ హాస్టల్‌పై తరుచూ ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ విద్యార్థులు దాడి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేస్తున్న కుమార్ యాదవ్ ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోగా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనపై ఇరువర్గాల విద్యార్థులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.

    దాడి చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచికత్తుపై రాత్రి విడిచిపెట్టారు. గత నెలలో హాస్టల్ గదుల దహనం, విద్యార్థి సంఘాల నాయకుల పరస్పర దాడులు మరవకముందే పరిశోధన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా పోలీసులు ముందు జాగ్రత్తగా రెండు హాస్టళ్ల వద్ద బలగాలను మోహరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement