
రోడ్డు ప్రమాదంలో 8మంది చిన్నారులకు గాయాలు
పలాస : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ గురుకుల విద్యాలయానికి చెందిన 8 మంది ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన తరువాత వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామానికి చెందిన విద్యార్థులు ఆటోలో తమ స్వగ్రామానికి ప్రయాణమయ్యారు.
అయితే మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర రైల్వేగేటు సమీపంలో ఎదురుగా వచ్చిన వాటర్ క్యాన్‌ల వ్యాన్ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కాశీబుగ్గలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.