విస్సన్నపేట మండలం : నరసాపురం బాలికల గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనాల అనంతరం ఈ ఘటన జరగగా ఆదివారం ఈ విషయం వెలుగులోకొచ్చింది. సాయంత్రానికి వారిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరింత మెరుగైన చికిత్స అవసరమైన మరో ఇద్దరు విద్యార్థినులను అక్కడినుంచి విజయవాడకు తరలించారు. కలుషితాహారమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
విస్సన్నపేట, న్యూస్‌లైన్ : మండలంలోని నరసాపురం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో సుమారు 500మందికి పైగా చదువుకుంటున్నారు. కాగా శనివారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయానికి విద్యుత్ లేకపోవడంతో చీకటిలోనే భోజనం ముగించారు.
ఆదివారం ఉదయం నుంచి 86 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు. అయితే సంబంధిత పాఠశాల బాధ్యులు విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పాఠశాలలోనే వైద్యం చేయించారు. ఆదివారం కావటంతో విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు రావటంతో అస్వస్థత విషయం బయట పడింది, సమాచారం అందుకున్న విలేకరులు పాఠశాలకు వెళ్లే సరికి అస్వస్థతతో ఉన్న విద్యార్థులందరినీ ఓ గదిలో ఉంచారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో 108 వాహనాలకు సమాచారం అందించి విద్యార్థులను మెరుగైన వైద్యంకోసం నూజివీడుకు తరలించారు.
కలుషిత ఆహారమే కారణమా?
కలుషిత ఆహారమే కారణమై ఉండవచ్చని విద్యార్థుల తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. వంటగది, భోజనం హాలులో కరెంట్‌పోతే చీకట్లో భోజనం పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు పెట్టే మజ్జిగ పచ్చగా రంగు మారి ఉండటం,వంకాయలు పుచ్చిపోయినవే వంటకు వినియోగిస్తుండడంతో వంట మేస్త్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవటం,హెచ్‌ఎస్ సెలవులో ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా సంఘటనా స్థలానికి తహ శీల్దార్ సాయిగోపాల్ చేరుకుని విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. విస్సన్నపేట పీహెచ్‌సీ సిబ్బందిని పిలిపించి పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య సేవలు అంద చేయించారు. వైద్యాధికారి సీతారామ్ అస్వస్థతగా ఉన్న విద్యార్థులను పరిశీలించి మందులు పంపిణీ చేశారు. ప్రాణాపాయం లేదని కలుషిత ఆహారమా.. మరేదన్నానా అనేది తేలాల్సి ఉందన్నారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని ఎంఆర్‌పీఎస్ నియోజక వర్గ యువత అధ్యక్షుడు మేశపాం క్రిష్ణచైతన్య డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామన్నారు.
నూజివీడు ఆస్పత్రిలో చికిత్స.....
నూజివీడు : విస్సన్నపేట మండలం నర్సాపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం అస్వస్థతకు గురైన 86మంది విద్యార్థినులను వైద్యచికిత్స నిమిత్తం ఆదివారం సాయంత్రం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్రసింగ్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం హుటాహుటిన విద్యార్థినులకు చికిత్స ప్రారంభించారు.
సబ్‌కలెక్టర్ కేవీఎన్.చక్రధర్‌బాబు ఏరియా ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ కే సూర్యచంద్రరావు ఏరియా ఆస్పత్రికి వచ్చి విద్యార్థినుల పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా కారుమంచి మేఘన, కొల్లా సింధులకు కడుపులోనొప్పి ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.
తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆగ్రహం...
విద్యార్థుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్‌వీ రమణమ్మ ఆదివారం గురుకుల పాఠశాలకు గానీ, ఆస్పత్రి వద్దకు గానీ రాకపోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరామర్శించిన ప్రతాప్.....
అస్వస్థతకు గురైన విద్యార్థులను మాజీ ఎమ్మేల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు పరామర్శించారు. నూతక్కివేణు, లాకా వెంగళరావుయాదవ్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనయుడు శ్రీనివాస్ తదితరులు ఆస్పత్రికి వెళ్లివిద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గురుకుల విద్యార్థినులు...86 మందికి అస్వస్థత
Published Mon, Mar 31 2014 3:12 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Advertisement