కంగ్టి : ఓ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంగ్టి మండలం నాగూర్(బి) లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాగూర్(బి) గ్రామానికి చెంది న ఓ బాలిక(14) ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన హెచ్‌ఎం అంబాజీ, స్థానికులైన సంజీవ్, రవి అనే వ్యక్తులు ఈ నెల 8న పూజ అనే అమ్మాయి వెంట బాలికను బీదర్‌కు బలవంతంగా పంపారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఆ బాలిక ఇంట్లో చెప్పకుండా బీదర్ వెళ్లింది. అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి మత్తు మందు ఇవ్వడంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. దాంతో వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఆ బాలికను వారంపాటు బీదర్‌లో రహస్యంగా ఉంచారు. ఈనెల 11న ఉదయం సదరు ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను బీదర్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు.
అక్కడ బాలికకు తన గ్రామానికి చెందిన వారు కలవడంతో వారి సహకారంతో అదే రోజు రాత్రికి ఇంటికి చేరుకుంది. నాలుగు రోజులుగా తమ కూతురు కన్పించకపోవడంతో ఆమె తల్లి తల్లడిల్లిపోయింది. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని తల్లికి, బంధువులకు బాలిక శుక్రవారం వివరించింది. దీంతో బీదర్ వెళ్లాలని చెప్పిన స్థానికుల ఇంటికి బంధువులు ఈ విషయమై నిలదీయగా వారు దాడి చేసి బెదిరించారు. భయాందోళనకు గురైన తల్లి, కూతురు ఆదివారం కంగ్టి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఆరుగురిపై నిర్భయ చట్టం కింద కేసు..
ఈ కేసుకు సంబంధించి బాలికను బెదిరించి బీదర్‌కు పంపిన యూపీఎస్ హెచ్‌ఎం అంబాజీ, గ్రామానికి చెందిన సంజీవ్, రవితోపాటు బీదర్‌లో లైంగిక దాడికి పాల్పడిన గుర్తుతెలియని మరో ఇద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని కంగ్టి ఎస్‌ఐ కమలాకర్ తెలిపారు. బీదర్‌కు తీసుకెళ్లిన పూజ అలియాస్ సిద్ధమ్మపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా నిందితుడిగా ఉన్న హెచ్‌ఎం అంబాజీ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం పొందాడు.