మితిమీరిన వేగం..మృత్యుపాశం
Published Mon, Apr 7 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
కొత్తపేట / ఉప్పలగుప్తం / అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలెం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు తాడిచెరువుగట్టు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చాట్ల దుర్గారావు (40) అతని భార్య దుర్గ (35), కుమార్తె చిట్టి (3), తల్లి నాగరత్నం (పాపమ్మ) (60), పినతల్లి నాగమణి (45), పినతండ్రి కొడుకు బాలకృష్ణ (35), అన్న కుమారుడు నాని (10), అక్క నేదునూరి మంగ (45), పినతండ్రి చాట్ల వెంకటేశ్వరరావు(45) విగతజీవులయ్యారు. దుర్గారావు మరో కుమార్తె జ్యోతి (5), వెంకటేశ్వరరావు కుమారుడు పల్లయ్య గాయాలతో బయటపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దుర్గారావు ఆటోను అతివేగంగా నడపడంతో పాటు సెల్‌ఫోన్లో మాట్లాడడమే ఈ మృత్యుహేలకు మూలకారణమని ప్రమాదాన్ని చూసిన వారు అంటున్నారు. ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముహూర్తం వేళకు చేరాలన్న ఆత్రంతో ముప్పు..
ఆటో డ్రైవర్ దుర్గారావు చెల్లెలు లంక పార్వతిది రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు. ఆమెకు ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు మీదు (పై) పళ్లు వచ్చాయి. అలా రావడం మేనమేమకు దోషమన్న నమ్మకంతో శాంతి చేయించాలనుకున్నారు. ఆదివారం ఉదయం 9.10 గంటలకు అందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఆ వేడుకకు కుటుంబసభ్యులను, రక్తసంబంధీకులను తీసుకుని తాడిచెరువుగట్టు నుంచి బయల్దేరిన దుర్గారావు ముహూర్తం వేళకు ముమ్మిడివరప్పాడు చేరుకోవాలన్న ఆరాటంతో ఆటోను అతివేగంగా నడిపాడు. గొలకోటివారిపాలెం వచ్చేసరికి ముందు వెళుతున్న అమలాపురం- రాజమండ్రి ఆర్టీసీ బస్సు ప్రయాణికులు దిగేందుకు ఆగింది. అతివేగంగా ఆటోను నడుపుతూనే సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న దుర్గారావు బస్సును తప్పించే ప్రయత్నం చేయగా..
ఆటో రోడ్డుపై తిరగబడింది. అదే సమయంలో రావులపాలెం నుంచి ముక్కామల వైపు కొబ్బరి లోడుతో వెళుతున్న ఐషర్‌వ్యాన్ ఆటోను బలంగా ఢీకొని కొన్నిమీటర్ల దూరం ఈడ్చుకుపోయి రోడ్డు పక్కనే ఉన్న తురాయి చెట్టు, వంతెనగోడల మీదికి దూసుకుపోయింది. ఆటో.. వ్యానుకు, చెట్టు, వంతెన గోడలకు మధ్య ఇరుక్కుని నుజ్జయిపోగా దుర్గారావు, దుర్గ, నాగరత్నం, నాగమణి,బాలకృష్ణ, నాని, మంగ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వరరావు, చిట్టి, పల్లయ్యలను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిట్టి, వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించారు. పల్లయ్య రాజమండ్రిలో చికిత్స పొందుతుండగా.. స్వల్పగాయాలతో బయటపడ్డ జ్యోతిని కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం బంధువులు తీసుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంతో అటు తాడిచెరువుగట్టు గ్రామంలో ఇటు ముమ్మిడివరప్పాడులో విషాదం అలముకుంది.
బాధితులకు నేతల పరామర్శ
అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఈ విషాద సంఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గొలకోటివారిపాలెం, కొత్తపేట ప్రభుత్వాస్పత్రులకు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. రోదిస్తున్న బంధువులను ఊరడించారు. రావులపాలెం సీఐ సుధాకర్, ఎస్సై ఎ.బాలాజీ ప్రమాద వివరాలను నాయకులకు వివరించారు. కాగా కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి వచ్చిన అమలాపురం ఆర్డీవో సీహెచ్ ప్రియాంకను కోనసీమ మాదిగ దండోరా నాయకులు ఘెరావ్ చేసి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా తాడిచెరువుగట్టులో మృతుల బంధువులను వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు.
వ్యాను వేగమూ ప్రమాద తీవ్రతకు కారణం..
ప్రమాద తీవ్రతకు ఆటో.. వ్యానుకు, తురాయి చెట్టు, వంతెన గోడలకు మధ్య ఇరుక్కుపోవడమే కారణమని స్థానికులు అంటున్నారు. చెట్టు, వంతెన గోడల మధ్య ఇరుక్కోకుంటే.. వ్యాను ఈడ్చుకుపోయిన ఆటో కాలువలో పడి, ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అంటున్నారు. అలాగే ఆటో తిరగబడిన సమయంలో వ్యాను అతివేగంతో రావడం కూడా ఇంత ఘోరానికి కారణమంటున్నారు. ప్రమాద స్థలం గొలకోటివారిపాలెంతో పాటు సమీప గ్రామాలకు ముఖ్యకూడలి. రోజూ అదే సమయంలో ఎందరో విద్యార్థులు బస్సు ఎక్కేందుకు అక్కడ వేచి ఉంటారు. అయితే ఆదివారం కావడంతో ఆ కూడలి దాదాపు నిర్జనంగా ఉంది. లేకుంటే ఈ దుర్ఘటన మరింత విషాదానికి కారణమయ్యేది.
ఏడీ నాన్న అంటే.. ఏం చెప్పేది?
‘ఒడిలో బిడ్డ.. కడుపులో బిడ్డ.. రేపు వీళ్లిద్దరూ.. ‘అమ్మా! నాన్న ఎక్కడ?’ అంటే నేనేమి చెప్పేది భగవంతుడా!’ అని తాడిచెరువుగట్టుకు చెందిన కుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. గొలకోటివారిపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన బాలకృష్ణ ఆమె భర్త. వారికి రెండేళ్ల కుమార్తె ఉండగా ప్రస్తుతం కుమారి గర్భిణి. ఆడపడుచు ఇంట జరిగే వేడుకకు కుమారి కూడా వెళ్లాల్సి ఉన్నా ఆదివారం కావడంతో చర్చికి వెళ్లాలని ఆగిపోయింది. బాలకృష్ణ అన్న శ్రీను హైదరాబాద్‌లో ఉంటుండగా.. అతడి కుమారుడు నాని చిన్నాన్న వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో చిన్నాన్న వెంట బయల్దేరిన నాని కూడా మృత్యువాత పడ్డాడు.
నాన్న ఇక రాడమ్మా..!
ప్రమాదంలో మరణించిన వెంకటేశ్వరరావు భార్య మంగ ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితం కువైట్ వెళ్లింది. వారి కుమార్తెలు రాజ్యలక్ష్మి, ప్రమిత గొల్లవిల్లి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నారు. రాజ్యలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాస్తోంది. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా చిన్నవాడైన పల్లయ్య తండ్రితో వేడుకకు బయల్దేరి గాయాల పాలయ్యాడు. జరిగిన ఘోరం తెలిసి హాస్టల్ నుంచి వచ్చిన రాజ్యలక్ష్మి, ప్రమిత.. ఒకరిని పట్టుకుని ఒకరు గోలుగోలును విలపించారు. ‘అమ్మా.. నాన్న మనకిక లేడమ్మా.. తిరిగి రాడమ్మా’ అంటూ రోదిస్తుంటే అందరి హృదయాలూ బరువెక్కాయి.
Advertisement