
కాసేపట్లో..
- నేతల ‘లెక్కలు’ తేలేది నేడే
- ఉదయం8 గంటలకు ప్రారంభం
- 9 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
- 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు
- ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లకు చెరో 14 టేబుళ్లు
- తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
ట్వంటీ..ట్వంటీ మ్యాచ్‌లో కూడా ఇంత ఒత్తిడి ఉండదేమో... దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఉత్కంఠ కనిపించిన ఎన్నికలు ఇవేనేమో. కాసేపట్లోనే ఈవీఎంలు నోళ్లు తెరుస్తాయి. ఓటరన్న ఎవరి నుదుట ‘ఓటో’గ్రాఫ్ చేశాడో తేలుస్తాయి. సార్వత్రిక ఎన్నికల హీరోలెవరో... జీరోలెవరో నిర్ణయిస్తాయి. తొమ్మిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 178 మంది పోటీలో ఉన్నారు. విశాఖ ఎంపీ స్థానంలో 22 మంది, అనకాపల్లి ఎంపీ స్థానంలో 8 మంది, అరకు ఎంపీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 7 పోలింగ్ జరగ్గా జిల్లాలో 71.94 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాలో జిల్లాలో 33,46,650 మంది ఓటర్లు ఉండగా 24,07,700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 12,05,618 మంది, పురుషులు 12,02,087 మంది ఉన్నారు. పెందుర్తిలో అత్యధికంగా 85.40 శాతం, అత్యల్పంగా పాడేరులో 58.68 శాతం ఓటింగ్ నమోదైంది.
లెక్కింపు జరిగేదిలా
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా లెక్కిస్తారు
ఎంపీ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, మరో హాల్‌లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 4 టేబుళ్లపై జరిగే ఈ లెక్కింపునకు 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తపాలా బ్యాలెట్ లెక్కింపు చేపట్టిన అరగంటలో ఈవీఎంలలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. తపాలా బ్యాలెట్ ఒకవైపు, ఈవీఎంలు మరోవైపు లెక్కింపు జరుగుతుంటుంది.
ఈవీఎంలు ఒక్కో రౌండ్ పూర్తవడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది.
నియోజకవర్గాలను బట్టి 14 నుంచి 22 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. మాడుగుల నియోజకవర్గానికి అత్యల్పంగా 14 రౌండ్ల లెక్కింపు జరగనుంది. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి అధికంగా 22 రౌండ్లు లెక్కింపు ఉండనుంది.
మధ్యాహ్నం 12 గంటల సమయానికి విజయావకాశాలు తెలిసిపోయే అవకాశమున్నప్పటికీ పూర్తి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి సాయంత్రం 3 నుంచి 4 అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈవీఎంల లెక్కింపు పూర్తవుతున్నప్పటికీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తికాని పక్షంలో చివరి ఈవీఎం లెక్కింపును ఆపుతారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే చివరి ఈవీఎంను తెరుస్తారు.
వేల సంఖ్యలో సిబ్బంది
ఓట్ల లెక్కింపు కోసం భారీగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. 650 మంది మైక్రోఅబ్జర్వర్లు, 642 మంది సూపర్‌వైజర్లు, 573 మంది అసిస్టెంట్లు, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చేందుకు నియోజకవర్గానికి 30 మంది సహాయకులతో పాటు ఇతర అధికారులు ఒక్కో సెగ్మెంట్‌కు 60 మంది ఉండనున్నారు.
భారీగా పోలీస్ బందోబస్తు
లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏ ర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రత చర్యలు చేపడుతున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు.