
గీత దాటొద్దు
- అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
- మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారం చేయరాదు
- 24 గంటల్లోపు రాజకీయ పార్టీల ఫ్లైక్సీలు తొలగించాలి
- {పజాప్రతినిధుల వద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి
- కలెక్టర్ రాంగోపాల్
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ స్పష్టం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రమంలో బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజకీయ నాయకులు, శాసనసభ్యులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.
మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారాలు వద్దు
మతసంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ఆయా కమిటీలకు వాగ్దానాలు చేయడం, హామీలివ్వడం, పనులు చేపట్టరాదన్నారు. కుల, మత ప్రాతిపదికపై ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఫ్లెక్సీలు తొలగించాలి
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోపు తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్, పంచాయతీ చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు అయ్యేవరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యం త్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించి నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రతినిధుల వద్ద విధుల కోసం డెప్యుటేషన్‌పై వెళ్లిన ప్రభుత్వ అధికారులు వారి మాతృశాఖకు తిరిగి రావాలని ఆదేశించారు.
నూతన పనులు చేపట్టరాదు
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి ఎలాంటి నూతన పనులూ చేపట్టరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనులనే పూర్తి చేయాలన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే ఏదైనా చర్యలు చేపట్టాలంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. బోరు, మోటారు రిపేరులాంటి పనులు చేపట్టవచ్చునని, వీటికి నిధులు సమస్య లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, ఎన్నికల విభాగం అధికారులు పార్థసారథి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.