the Assembly
-
తీర్మానం చేసేంతవరకు పోరాటం
ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టీకరణ అవసరం తీరాక చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు మాట తప్పితే గద్దె దిగాల్సి వస్తుంది ఎన్ని అడ్డంకులు కల్పించినా రేపు అసెంబ్లీని ముట్టడించితీరతాం.. సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం చేసేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని, ఇచ్చిన మాట తప్పితే ఏపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి సీఎం చంద్రబాబు ఏదైనా చేస్తారనడానికి వర్గీకరణ అంశమే పెద్ద ఉదాహరణ అన్నారు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మీది.. వర్గీకరణ చేసే బాధ్యత నాది అన్న బాబు అవసరం తీరిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో లేని తెలంగాణలో వర్గీకరణపై తీర్మానం కోరిన టీడీపీ.. అధికారమున్న చోట తీర్మానం పెట్టడం లేదని, ఇది మోసం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తక్షణం వర్గీకరణపై తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీ ముట్టడిస్తా మన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కును లేకుండా చేయడం అమానుషమన్నారు. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తమ నాయకుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారన్నారు. ఎక్కడా అరెస్టులు జరగకపోతే లక్షల్లో మాదిగలు అసెంబ్లీని ముట్టడిస్తారన్నారు. మాదిగలకు న్యాయం చేయలేని బాబు ఎవరినైనా మోసం చేస్తారన్నారు. వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని 20 ఏళ్లుగా చంద్రబాబు చెప్పడాన్ని నమ్మి ఎన్నికల ముందు ఆయన పాదయాత్రకు సహకరించామని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించడానికి టీడీపీకి మద్దతు ఇచ్చామని అన్నారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు న్యాయమన్నారు. పెద్ద మాదిగనన్నారు.. గతంలో టీడీపీ హయాంలో చేసిన వర్గీకరణను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2004 నవంబర్ 5న రద్దు చేసి, మళ్లీ అదే ఏడాది డిసెంబర్ 10న అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా.. ఢిల్లీకి వెళ్లి అయినా వర్గీకరణ సాధిద్దామన్నారని, ఈ విషయమై ఆ పార్టీ పోలిటికల్బ్యూరో కూడా తీర్మానం చేసిందని చెప్పారు. 2010 అక్టోబర్ 18న ప్రతిపక్షనేతగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని చెప్పారని మందకృష్ణ గుర్తుచేశారు. ఏపీలో టీడీపీ గెలుపునకు సహకరించింది తామేనన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వర్గీకరణ జరక్కపోతే మాదిగలకు దక్కాల్సిన అవకాశాలు కూడా దక్కవన్నారు. ప్రస్తుతం జనాభా దామాషా ప్రకారం తెలంగాణలో మాదిగలకు రిజర్వేషన్ శాతం పెరిగిందని, అదే ఏపీ విషయానికి వస్తే తగ్గిందన్నారు. లక్ష్య సాధన దిశగా దశల వారీగా ముందుకు వెళతామని చెప్పారు. -
కాసేపట్లో..
నేతల ‘లెక్కలు’ తేలేది నేడే ఉదయం8 గంటలకు ప్రారంభం 9 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లకు చెరో 14 టేబుళ్లు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ట్వంటీ..ట్వంటీ మ్యాచ్‌లో కూడా ఇంత ఒత్తిడి ఉండదేమో... దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఉత్కంఠ కనిపించిన ఎన్నికలు ఇవేనేమో. కాసేపట్లోనే ఈవీఎంలు నోళ్లు తెరుస్తాయి. ఓటరన్న ఎవరి నుదుట ‘ఓటో’గ్రాఫ్ చేశాడో తేలుస్తాయి. సార్వత్రిక ఎన్నికల హీరోలెవరో... జీరోలెవరో నిర్ణయిస్తాయి. తొమ్మిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 178 మంది పోటీలో ఉన్నారు. విశాఖ ఎంపీ స్థానంలో 22 మంది, అనకాపల్లి ఎంపీ స్థానంలో 8 మంది, అరకు ఎంపీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 7 పోలింగ్ జరగ్గా జిల్లాలో 71.94 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాలో జిల్లాలో 33,46,650 మంది ఓటర్లు ఉండగా 24,07,700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 12,05,618 మంది, పురుషులు 12,02,087 మంది ఉన్నారు. పెందుర్తిలో అత్యధికంగా 85.40 శాతం, అత్యల్పంగా పాడేరులో 58.68 శాతం ఓటింగ్ నమోదైంది. లెక్కింపు జరిగేదిలా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా లెక్కిస్తారు ఎంపీ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, మరో హాల్లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 4 టేబుళ్లపై జరిగే ఈ లెక్కింపునకు 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తపాలా బ్యాలెట్ లెక్కింపు చేపట్టిన అరగంటలో ఈవీఎంలలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. తపాలా బ్యాలెట్ ఒకవైపు, ఈవీఎంలు మరోవైపు లెక్కింపు జరుగుతుంటుంది. ఈవీఎంలు ఒక్కో రౌండ్ పూర్తవడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. నియోజకవర్గాలను బట్టి 14 నుంచి 22 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. మాడుగుల నియోజకవర్గానికి అత్యల్పంగా 14 రౌండ్ల లెక్కింపు జరగనుంది. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి అధికంగా 22 రౌండ్లు లెక్కింపు ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి విజయావకాశాలు తెలిసిపోయే అవకాశమున్నప్పటికీ పూర్తి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి సాయంత్రం 3 నుంచి 4 అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈవీఎంల లెక్కింపు పూర్తవుతున్నప్పటికీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తికాని పక్షంలో చివరి ఈవీఎం లెక్కింపును ఆపుతారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే చివరి ఈవీఎంను తెరుస్తారు. వేల సంఖ్యలో సిబ్బంది ఓట్ల లెక్కింపు కోసం భారీగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. 650 మంది మైక్రోఅబ్జర్వర్లు, 642 మంది సూపర్వైజర్లు, 573 మంది అసిస్టెంట్లు, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చేందుకు నియోజకవర్గానికి 30 మంది సహాయకులతో పాటు ఇతర అధికారులు ఒక్కో సెగ్మెంట్‌కు 60 మంది ఉండనున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏ ర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రత చర్యలు చేపడుతున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. -
గీత దాటొద్దు
అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారం చేయరాదు 24 గంటల్లోపు రాజకీయ పార్టీల ఫ్లైక్సీలు తొలగించాలి {పజాప్రతినిధుల వద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి కలెక్టర్ రాంగోపాల్ చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ స్పష్టం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రమంలో బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజకీయ నాయకులు, శాసనసభ్యులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారాలు వద్దు మతసంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ఆయా కమిటీలకు వాగ్దానాలు చేయడం, హామీలివ్వడం, పనులు చేపట్టరాదన్నారు. కుల, మత ప్రాతిపదికపై ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఫ్లెక్సీలు తొలగించాలి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోపు తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్, పంచాయతీ చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు అయ్యేవరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యం త్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించి నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రతినిధుల వద్ద విధుల కోసం డెప్యుటేషన్‌పై వెళ్లిన ప్రభుత్వ అధికారులు వారి మాతృశాఖకు తిరిగి రావాలని ఆదేశించారు. నూతన పనులు చేపట్టరాదు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి ఎలాంటి నూతన పనులూ చేపట్టరాదని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనులనే పూర్తి చేయాలన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే ఏదైనా చర్యలు చేపట్టాలంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. బోరు, మోటారు రిపేరులాంటి పనులు చేపట్టవచ్చునని, వీటికి నిధులు సమస్య లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, ఎన్నికల విభాగం అధికారులు పార్థసారథి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.