ఆధార్ సీడింగ్‌లో ‘తూర్పు’ ఆదర్శం
సాక్షి, కాకినాడ :ఆధార్ నమోదులో నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు సీడింగ్‌లో 95 శాతం పూర్తి చేసి రాష్ర్టంలోనే తూర్పుగోదావరి ఆదర్శంగా నిలిచిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ నీతూప్రసాద్‌తో పాటు జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆధార్ సీడింగ్‌లో ‘తూర్పుగోదావరి’ని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. విజయవాడలో గురువారం జరిగిన రాష్ర్ట స్థాయి ‘కలెక్టర్ల కాన్ఫరెన్స్’లో కలెక్టర్ నీతూప్రసాద్ ఆధార్ సీడింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. శాఖల వారీగా ఆధార్ సీడింగ్ జరిగిన తీరును వివరిస్తూ సీడింగ్ వల్ల ఇప్పటి వరకు 14 శాతం నిధులను ఆదా చేయగలిగామని గణాంకాలతో వివరించారు. రేషన్‌కార్డులకు నూరు శాతం ఆధార్ సీడింగ్ అమలుచేస్తే ఒక్క మా జిల్లాలోనే ఏటా రూ.100 కోట్ల మేర నిధులను ఆదా చేయవచ్చునని చెప్పారు.
త్వరలో అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌తో అనుసంధానంచేయనున్నట్టు సీఎం చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతీ కుటుంబంలో భార్యభర్తలిద్దరూ ఆధార్ సీడింగ్‌తో బ్యాంకు అకౌంట్లు తీసుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ఇంకా ఆధార్ కార్డులు జారీ కాని వారిని గుర్తించి అవసరమైతే మళ్లీ ఆధార్ నమోదు చేసేందుకు, అలాగే నూరుశాతం సీడింగ్ పూర్తి చేసేందుకు అన్ని జిల్లాలకు త్వరలోనే మొబైల్ ఆధార్ సీడింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆధార్ డెరైక్టర్ రామిరెడ్డి వివరించారు. అలాగే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై కలెక్టర్ నీతూప్రసాద్ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన పెట్రోయూనివర్సిటీతో పాటు పారిశ్రామిక, విద్యా, మౌలికరంగాలకు సంబంధించిన జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులు..
కల్పించాల్సిన సౌకర్యాలను కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీటిని ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాన్ఫరెన్స్ విశేషాలను కలెక్టర్ నీతూప్రసాద్ విజయవాడ నుంచి నేరుగా‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. అదే విధంగా ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవిప్రకాష్‌తో కూడా ముఖ్యమంత్రితోపాటు ఇతర ఉన్నతాధికారులు ఇంటరాక్షన్ అయ్యారు. జిల్లాలో శాంతిభద్రతలు, మావోయిస్టుల కదలికలు తదితర అంశాలు ఈ ముఖాముఖిలో చర్చకు వచ్చినట్టు తెలియవచ్చింది.