నౌపడలో నేలకొరిగిన విద్యుత్ స్తంభం
(శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) /అరసవల్లి (శ్రీకాకుళం): ఎక్కడ చూసినా నేలకూ లిన, వాలిపోయిన విద్యుత్తు స్తంభాలు... ఊగులాడుతున్న... నేలపై దొర్లాడుతున్న వైర్లు.. వందలాది పల్లెల్లోనే కాదు.. టెక్కలి, ఇచ్ఛాపురం లాంటి ప్రధాన పట్టణాల్లోనూ మూడురోజులుగా గాఢాంధకారమే. విద్యుత్ సరఫరా లేక పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్దాన ప్రాంతమైన సోంపేట, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు, కవిటి, కంచిలితోపాటు పాతపట్నం, సంతబొమ్మాళి మండల కేంద్రాల్లోనూ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రజలు చీకట్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు వర్షాలవల్ల పారిశుధ్యం దెబ్బతిని ఈగలు, దోమలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్తు లేకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణించనలవిగాకున్నాయి. తిత్లీ తుపాను విధ్వంసం సృష్టించిన సిక్కోలు పల్లెలు, పట్టణాల్లో అలుముకున్న చిమ్మచీకట్లు ఎప్పుడు తొలగిపోతాయా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో మొత్తం 4,319 గ్రామాలు అంధకారంలో మునిగిపోగా 2,762 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు శనివారం ప్రకటించారు. 1,557 గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి 2,600కుపైగా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయని సమాచారం.
23 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం
శ్రీకాకుళం జిల్లాలో 33 కేవీ, 11కేవీ, లోటెన్షన్ వెరసి 23 వేల వరకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని అధికారులు చెబుతున్నారు. 33 కేవీ వైర్లు 1,358 కిలోమీటర్లు, లోటెన్షన్ వైర్లు 5,316 కిలోమీటర్లు, 11 కేవీ వైర్లు 3,102.7 కిలోమీటర్ల మేరకు తెగిపోయాయని అధికారిక సమాచారం. వీటన్నింటినీ సరిచేసి అన్ని ఆవాస ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడానికి ఎన్ని రోజులు పడుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. టెక్కలి నుంచి పలాస మధ్య టవర్లు 5, పలాస–ఇచ్ఛాపురం మధ్య ఒకటి కలిపి మొత్తం ఆరు 132 కేవీ టవర్లు పడిపోయాయి. వాటిని సరిచేయడానికి సాంకేతికంగా సమస్యలున్నాయని, అందువల్ల పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఎప్పటిలోగా పునరుద్ధరించగలమనేది చెప్పలేమని ఒక ఉన్నతాధికారి(ఆఫ్ ద రికార్డు) చెప్పారు. జిల్లాలోనే ఉన్న సీఎం చంద్రబాబు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో చెప్పకపోవడం గమనార్హం.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు
కూలిపోయిన ప్రాంతాల్లో వేరే స్తంభాలు ఏర్పాటుచేసి, వైర్లు సరిచేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శేషుకుమార్, జనరల్ మేనేజరు(ఆపరేషన్స్) సూర్యప్రతాప్ తెలిపారు.
తాగునీటికి సమస్య..
విద్యుత్తు సరఫరా లేక జిల్లాలో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతోపాటు ఇచ్ఛాపురం, టెక్కలి, సోంపేట తదితర ప్రాంతాలకు నదులనుంచి శుద్ధి చేసిన నీటిని పైపులైన్లద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించినా అనేక పట్టణాలు, 1,557 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా లేదు. దీనివల్ల తాగునీటి సరఫరా ఆగిపోయింది. కరెంటు లేక బోర్లూ పనిచేయట్లేదు. ఫలితంగా ప్రజలకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. వైద్య సేవలకు అంతరాయం తప్పట్లేదు.
గణాంకాల్లో నిజమెంత?
విద్యుత్తు స్తంభాలు విరిగిపోయినట్లు, వంగిపోయినట్లు ఈపీడీసీఎల్ చెబుతున్న లెక్కలపై విద్యుత్‌రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వంగిపోయిన, పడిపోయిన విద్యుత్తు స్తంభాలు 23 వేలు అనేది చాలా పెద్దమొత్తమని, అన్ని ఉండకపోవచ్చని ఈ విభాగంలో అపార అనుభవమున్న ఒక అధికారి అన్నారు. అత్యధిక గ్రామాలు, పట్టణాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది కదా? అని ప్రశ్నించగా.. ‘కరెంటు సరఫరా ఆగిపోవడానికి స్తంభాలు పడిపోవడమొక్కటే కారణం కాదు. వైరును వైరును కలిపే జాయింట్ ఊడిపోయినా, ట్రాన్స్‌ఫార్మర్లతో సమస్య ఏర్పడినా విద్యుత్తు సరఫరా కాదు’ అని ఆయన వివరించారు. అధికారులు ఇలా అసత్య లెక్కలు ఎందుకు చూపుతారని ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని వాకబు చేయగా.. ‘తుపాను పునరుద్ధరణ పనులపై ఆడిటింగ్ ఉండదు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలనికూడా ఉండదు. అత్యవసర పనుల కింద ఇష్టారాజ్యంగా చేయించి భారీగా నిధులు మింగేయవచ్చు. ఇలా చేయడానికి తప్పుడు లెక్కలు చూపుతుంటారనే అభిప్రాయముంది’ అని ఆయన బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment