ఆలమూరు : భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా సమగ్ర భూ సర్వేను చేపట్టేందుకు రాష్ట్రం ప్రభుత్వం నేషనల్ లాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) ప్రవేశపెడుతున్నట్టు రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ ఆఫ్ సర్వే (ఆర్‌డీడీ) కె.వెంకటేశ్వరరావు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే జరగక రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రాథమిక సర్వే నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు.
అనంతరం సేకరించిన వివరాలతో జిల్లా నుంచి డివిజన్ స్థాయి వరకూ సమగ్ర వివరాలతో కూడిన సర్వే జరిపేందుకు సుమారు ఐదేళ్లు పడుతుందన్నారు. ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ పూర్తయితే భూక్రయవిక్రయాల్లో పటిష్ట విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఏవిధమైన పొరపాట్లకు తావు లేకుండా సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పక్రియ సంయుక్తంగా అమలు జరుగుతుందన్నారు. తమ శాఖ కాకినాడ డివిజన్‌లోని ఆరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 92 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామన్నారు. రాజధాని భూసేకరణకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 500 మంది లెసైన్స్‌డ్ సర్వేయర్లను వినియోగించే ఆలోచన ఉందన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ సేకరించిన ‘వెబ్ ల్యాండ్ ప్రోగ్రామ్’ వివరాల స్కానింగ్ జరిగిందని, త్వరలోనే వాటిని డిజిటలైజేషన్ చేయన్నామని చెప్పారు.
భూసర్వేకు మార్గదర్శకాలు
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు మార్గదర్శకాలు నిర్దేశించినట్టు ఆర్‌డీడీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కొక్క మండల సర్వేయర్ రోజుకు ఏడుసబ్ డివిజన్ల చొప్పున నెలకు నాలుగు గ్రామాల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, పోరంబోకు స్థలాల వివరాల నమోదు, భూసేకరణ, పోరంబోకు భూముల బదలాయింపు, పట్టాల సబ్ డివిజన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర భూసర్వే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు.
సమగ్ర సర్వేతో భూవివాదాలకు చెక్
Published Sat, Nov 8 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement