రైతన్న కంటతడి! | A few days of rain fall in the district | Sakshi
Sakshi News home page

రైతన్న కంటతడి!

Published Wed, Oct 23 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

A few days of rain fall in the district

జిల్లాలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వరుణ దేవుడు కరుణించినట్లే కరుణించి కర్షకులకు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాడు. అతివృష్టి కారణంగా కళ్లెదుటే పంటలు నీట కుళ్లుతుంటే రైతులు దీనంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వర్షాల దెబ్బకు ఓ వైపు పంటలు దెబ్బతింటుంటే మరోవైపు తెగుళ్లు, పురుగుల బెడద తీవ్రంగా వేధిస్తోంది. వెరసి అన్నదాతకు కష్టాలు.. క న్నీళ్లు మిగలుతున్నాయి.    
 
 కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్:  కళ్లెదుటే నీట మునుగుతున్న పంటలు. చేతికొచ్చిన పైర్లు నోటికందని పరిస్థితి. ఈ ఏడాది వరుణుడు కరుణించాడని సంతోషిస్తున్న తరుణంలో అతివృష్టి తీరని నష్టం మిగుల్చుతోంది. 2009,2010లో అతివృష్టితో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. 2011,2012 సంవత్సరాల్లో అనావృష్టి వల్ల కూడా తీరని నష్టాన్ని చవిచూశారు.
 
 ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఊరిస్తూ వస్తున్న వర్షాలు చివరికి అతివృష్టిగా మారి రైతులను నట్టేట ముంచాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ పంటల రైతులకు ఈ వర్షాలు కంట తడిపెట్టిస్తున్నాయి. చేతికందిన వేరుశనగ, పెసర, మినుము పంటలు వర్షానికి దెబ్బతినడంతో రైతులు కుమిలిపోతున్నారు. ఉద్యాన పంటలైన టమోట, మిరప, ఉల్లి కుళ్లిపోతుండగా, చామంతి, చాందినీ చామంతి, బంతి తోటలు నీటమునిగాయి.
 
 వీటికి తెగుళ్లు, పురుగులు విజృంభించి నష్టపరుస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉల్లి, టమోట, మిరప పంటలకు నల్లతెగులు, ఆకుమచ్చ తెగులు ఆశించాయని, దీనికి ఈ వర్షాలు మరింత తోడయ్యాయని, దీంతో పంట చేతికందే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు తెలిపారు. ఐదు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు పులకించారు. ఇక పంటలు చేతికి అందుతాయని, మంచి ఆదాయం వస్తుందని కలలు గన్నారు. అయితే ఉన్నట్లుండి సోమ, మంగళవారం రోజుల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి పైర్లు తడిసి కుళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఎండలు విపరీతంగా కాయడంతో పంటలు ఎండుదశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో మొన్న పై-లీన్ తుపాను ప్రభావంతో కొద్దిమేర వర్షం కురిసింది. దీంతో ఎలాంటి నష్టం లేదని జిల్లాలో ఖరీఫ్ వేరుశనగ కట్టెను పొలం నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే కొర్ర, సజ్జ పంటలు పూర్తి అయ్యాయి. కొర్ర పంటను కోసి పొలంపై ఉంచారు. ఈ పంట తడవడంతో చాలా మటుకు గింజలు రాలిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సజ్జ పంట కోతకు వచ్చిందని మరో నాలుగు రోజుల్లో కంకులు కోస్తామనుకున్న సమయంలో మాయదారి వర్షం కురవడంతో కంకులకు మోసులు వస్తున్నాయని పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, ప్రొద్దుటూరు, రాజుపాలెం, దువ్వూరు మండలాల రైతులు ఆవేదనతో తెలిపారు. పంట కోసం వేలాది రూపాయల పెట్టుబడులు పెడితే ఈ వర్షాలు నిండాముంచాయని రైతులు కంటతడిపెడుతున్నారు.
 
 
 ప్రధాన పంట వేరుశనగకు రూ.70 లక్షల  నష్టం
 జిల్లాలో ఖరీఫ్‌లో 46,118 హెక్టార్లలో వర్షాధారంగాను, బోరుబావుల కింద వేరుశనగ పంటను సాగు చేశారు. జూన్‌లో సాగు చేసిన ఈ పంట వర్షాలకు మంచి దిగుబడి ఇస్తుందని రైతులు అశించారు.
 
 అయితే వర్షాలు అధికం కావడంతో వర్షాధారం కింద ఎకరానికి 10 నుంచి12 బస్తాలు అవుతాయనుకున్న కాయలు 6 బస్తాలు, బోరుబావుల కింద 30 నుంచి 40 బస్తాలు అవుతాయనుకున్న కాయలు 20 బస్తాలు మించి దిగుబడి రాలేదని, దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ కాయలు కూడా భూమిలోనే పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో ఈ వర్షాలకు పంట దెబ్బతిని ఉండవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పశువుల మేతకు కూడా వేరుశనగ కట్టె పనికిరాని పరిస్థితి ఉందని అంటున్నారు. దాదాపు  రూ.70 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందనే అభిప్రాయాన్ని అధికారులు వెలిబుచ్చారు.
 
 సజ్జ, కొర్ర పంటలకు.....
 ఈ పంటలు 3281 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం పంటలు నూర్పిడికి సిద్ధమయ్యాయి. వర్షంతో మోసులు వస్తున్నాయని, దీని వల్ల రూ.3,4 లక్షల మేర నష్టం ఉంటుందని రైతులు పేర్కొన్నారు.
 
 కుళ్లుతున్న టమోట.. కన్నీటి చామంతి..
 జిల్లాలో టమోట పంట 600 హెక్టార్లలో సాగులో ఉన్నట్లు ఉద్యాన అధికారులు తెలిపారు. పంటకు కాయకుళ్లు తెగులు ఆశించిన మాట వాస్తవమేనని తెలిపారు. ప్రస్తుతం కిలో టమోట రూ.40 ధర పలుకుతున్నాయని, ఈ పాడు వర్షాల వల్ల కాయలు కుళ్లి నష్టం వస్తోందని రైతులు ఆవేదనతో తెలిపారు. చామంతి, చాందినీ చామంతి, బంతి పంటలు వెయ్యి హెక్టార్ల దాకా సాగులో ఉన్నాయి. పూలసాగు పువ్వు విచ్చుకునే దశలో ఉంది. చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఖాజీపేట, వేంపల్లె మండలాల్లో ఈ పంట నీటమునిగింది. దీంతో తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 
 రబీ పంట నేలపాలు
 ప్రస్తుతం రబీ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాజుపాళెం, ప్రొద్దుటూరు. జమ్మలమడుగు, పెద్దముడియం మండలాల్లో బుడ్డశనగ పంట, పొద్దుతిరుగుడు పంటలు సాగుచేశారు. ఈ వర్షాలకు విత్తనాలు మొలకలు వచ్చి కుళ్లిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement