ఖమ్మం, న్యూస్‌లైన్: ఓ బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం శివారులో గురువారం రాత్రి జరిగింది. పట్టణానికి చెందిన బాలిక (17) సాయంత్రం కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వస్తుండగా.. పట్టణానికి చెందిన క్రాంతి, మురళీకృష్ణ, ఆశీర్వాదం, సురేష్, ప్రదీప్, వీరేంద్ర ఆటోలో వచ్చారు. తాము ఇంటికే వెళ్తున్నామని మభ్యపెట్టి ఆటో ఎక్కించారు. మధ్యలో కూర్చోబెట్టి మత్తు మందును ముక్కు దగ్గర పెట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. శివారులో పొదల్లోకి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బలవంతంగా తాగించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, శుక్రవారం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.