హంపి ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఎంపీ ప్రకాష్ వేదికపై ఏర్పాటు చేసిన న్యూఢిల్లీకి చెందిన ప్రతిభా ప్రహ్లాద్ బృందం భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. సుమారు గంట పాటు సాగిన భరత నాట్యానికి సందర్శకులు తన్మయత్వం చెందారు. శ్రీకృష్ణదేవరాయ వేదికపై కన్నడ సినీ గాయకులు అర్చన ఉడుప పాడిన పాటలతో పాటు హిందీ సినీ గాయకుడు కూనాల్ గాంజావాల వినిపించిన పాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఆదివారం కడ్డి రాంపురం వద్ద నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ సత్తా చాటారు.
హంపి ఉత్సవాలకు రాష్ట్రం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా హంపి ఉత్సవాలను చూసేందుకు విచ్చేశారు. ఉదయం నుంచే హంపిలో సందర్శకుల తాకిడి మొదలైంది. విరుపాక్షేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బసన్న వీధిలో కృష్ణదేవాలయం రహదారిలో, గాయత్రి పీఠం రహదారిలో, రాణి స్నాన మందిర రహదారిలో పర్యాటకులు భారీగా కనిపించారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హంపిలోని గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వంటల పోటీకి అనూహ్య స్పందన
హంపి ఉత్సవాల్లో మహిళలకు నిర్వహించిన సంప్రదాయ రుచికర వంటల పోటీకి మంచి స్పందన లభించింది. ఆదివారం ఉత్సవాలు ముగియనుండటంతో రుచికర వంటల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు ఆసక్తి కనబరిచారు. కాజు, ఓళిగ, రాగిరొట్టె, జొన్నరొట్టె, రాగి ముద్ద, అరిసెలు, బర్ఫీ, గోధుమ సేమియా పాయసం, రోటీ తదితర రుచికరమైన 35 రకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వంటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానం విజేతకు రూ.15 వేలు, తృతీయ స్థానం విజేతకు రూ.10 వేల చెక్కులను పంపిణీ చేశారు.
- న్యూస్‌లైన్, బళ్లారి/ హొస్పేట
ఘనంగా ముగిసిన హంపి ఉత్సవాలు
Published Mon, Jan 13 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement