పూసపాటిరేగ : పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు బలైపోయాడు. తమతోనే వాదిస్తావా అంటూ వారు విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక ఏకంగా ప్రాణాలే వదిలాడు. కొప్పెర్ల పార్వతమ్మ జాతరలో జరిగిన ఓ చిన్నగొడవ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. పిక్కలాట వద్ద జరిగిన వాగ్వాదాన్ని సామరస్యంగా పరిష్కరించవలసిన పోలీసులు తీవ్రంగా కొట్టారని, దీంతో మల్లేశ్వరరావు మృతి చెందాడని అతని బంధువులు ఆందోళనకు దిగడంతో పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌వద్ద గురువారం రాత్రి ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెల్లవారుజాము వరకూ వారు ధర్నా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
మండలంలోని పాతకొప్పెర్లకు చెందిన పైడి మల్లేశ్వర్రావు(30) కొత్తకొప్పెర్లలో జరుగుతున్న పార్వతమ్మ జాతరకు వెళ్లాడు. జాతరలో పిక్కలు ఆట ఆడుతుండగా నిర్వాహకుడు, పైడి మల్లేశ్వర్రావుల మధ్య స్వల్ప వివాదం జరిగింది.దీంతో నిర్వాహకుడు జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ అక్కడకు రావడంతో కానిస్టేబుల్,మల్లేశ్వరరావుకు మధ్య మాటామాటా పెరిగింది. కొంత దూరంలో ఉన్న మిగతా పోలీసులు అక్కడకు చేరుకొని మల్లేశ్వరరావుపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన మల్లేశ్వరరావు అపస్మారక స్థితిలోకి చేరుకొన్నాడు. దీంతో బంధువులు చికిత్స కోసం అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసుల దెబ్బల వల్లే మల్లేశ్వరరావు మృతి చెందాడని, ఘటనకు బాధ్యులైన ముగ్గురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి ధర్నా చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జాతీయరహదారిపై బైఠాయించడంతో సుమారు ఎనిమిది కిలో మీటర్లు మేర రెండు వైపులు వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే భోగాపురం సీఐ వైకుంఠరావు, ఎస్‌ఐ షేక్ ఫకృద్దీన్‌లు అక్కడకు చేరుకొని, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు సమక్షంలో మృతుని బంధువులతో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని, బాధ్యులైన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతుడు మల్లేశ్వరరావుకు భార్య, కుమార్తె ఉన్నారు.
తహశీల్దార్ జి.జయదేవి సమక్షంలో మృత దేహానికి పంచనామా నిర్వహించారు. పూసపాటిరేగ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ ఫకృద్దీన్ మాట్లాడుతూ పోలీసులు కొట్టడం వల్ల మల్లేశ్వరరావు మృతి చెందాడా ? లేదా అఘాయిత్యానికి పాల్పడి మృతి చెందాడా ? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తేలుతుందని చెప్పారు.
మిన్నంటిన రోదనలు :
సరదాగా జాతరకు వెళ్లిన తన బిడ్డ శవంగా మారడంతో మల్లేశ్వరరావు తల్లి కమల రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడిపెట్టించింది. గర్భిణి అయిన మల్లేశ్వరరావు భార్య నాకు దిక్కెవరని రోదించడంతో అక్కడున్న వారందర్నీ కలిచివేసింది.
కానిస్టేబుల్ రమేష్ సస్పెన్షన్
విజయనగరం క్రైం: పూసపాటిరేగమండలం పాత కొప్పెర్ల గ్రామంలో పైడి మల్లేశ్వరరావు అనేయువకుడు మృతిచెందిన కేసులో కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం తెలిపారు. ఇదే కేసులో అభియోగం ఎదుర్కొంటున్న రాజు, సలీమ్‌లను ఆర్మ్‌డ్ రిజర్వు విభాగానికి అటాచ్ చేసినట్టు చెప్పారు. ఈ కేసుపై ఎస్సీఎస్టీ సెల్ డీఎస్పీ సయ్యద్ ఇషాక్ మహ్మద్ శుక్రవారం విచారణ జరిపారు. పాత కొప్పెర్ల గ్రామంలోని జాతర సందర్భంగా పోలీసులు కొట్డడం వల్లే యువకుడు మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఎస్పీ సయ్యద్ ఇషాక్‌మహ్మద్ మృతుని బంధువుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు.
భారీ మూల్యం !
Published Sat, Feb 14 2015 3:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement