తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన, స్థానిక బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బేషరతుగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలే అడ్డు పడినప్పటికీ బీజేపీ మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. దేశంలోని యువత అంతా నరేంద్ర మోడీ వైపే చూస్తోందన్నారు.
దేశంలో పెరిగిపోయిన అవినీతి, అక్రమాలను నిర్మూలించేందుకు మోడీ నాయకత్వంలో ఉద్యమిస్తామన్నారు. త్వరలో 11 రోజుల పాటు మోడీ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షలో భాగంగా గ్రామ గ్రామానా బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రచారం చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీను, చోళ రాంచరణ్ యాదవ్, పట్టణాధ్యక్షులు గోదల కృష్ణ, కటిక శ్రీను, సునీల్, వడ్ల జనార్ధన్, శ్రీపాల్, అంకం శ్రీనివాస్, శివ తదితరులు ఉన్నారు.