ఏలూరు : తన కాలనీలో ఉండే వివాహితుడిని ఓ యువతి ప్రేమించింది. అతడితో పెళ్లికి సైతం సిద్ధమైంది. వివాహితుడిని పెళ్లిచేసుకోవద్దని తల్లిదండ్రులు వారించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కొత్తపేట ఇందిరాకాలనీలో నివాసం ఉండే నగరపర్తి సింహాద్రి, అప్పాయమ్మ దంపతులకు మూడో కుమార్తె శిరీష (19).
ఆమె పదవ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, శిరీష తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుని జీవిస్తుంటారు. తమ కాలనీలో నివాసం ఉండే సూరిబాబు అనే తాపీమేస్త్రీతో శిరీష పరిచయం పెంచుకుంది. అయితే సూరిబాబుకు ఏడాది క్రితమే పెళ్లయింది. అయినప్పటికీ తనకు అతనితోనే వివాహం జరిపించాలంటూ శిరీష పట్టుబడుతోంది. అందుకు ఆమె తల్లిదండ్రులు సింహాద్రి, అప్పాయమ్మలు అంగీకరించకపోవటంతో మనస్తాపానికి లోనైంది. దీంతో గురువారం ఎవరు లేని సమయం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది.